Revanth Reddy : బట్టలు ఊడతీస్తా..తోలుతీస్తా అన్నవాళ్లు ఎటు పోయారు?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2026-01-03 14:32 GMT

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు రాకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. కృష్ణానదీ జలాలపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. వలస ప్రాంతమైన పాలమూరు నుంచి రాజకీయంగా ఎదిగి ఇక్కడకు వచ్చానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తనతో పాటు అక్కడ ఉన్న నేతలందరికీ పాలమూరు రైతుల దయనీయమైన స్థితి అందరికీ తెలుసునని చెప్పారు. గత కొద్ది రోజుల నుంచి ప్రతిపక్ష నేత పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తనపైనా, తన ప్రభుత్వంపైనా విమర్శలు చేశారన్నారు. కేసీఆర్ నలభైఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారని, అపారమైన అనుభవం ఉందని అనుకున్నామని, వారి సూచనలు ప్రభుత్వానికి ఇస్తారేమోనని భావిస్తే ఆయన సభకు కూడా రాకుండా వెళ్లిపోయారని రేవంత్ రెడ్డి అన్నారు.కృష్ణా నదీజలాలకు సంబంధించి ఒకరోజు, గోదావరి జలాలకు సంబంధించి ఒకరోజు సభలో చర్చిద్దామనుకున్నా ఆయనతో పాటు ఆయన పార్టీ సభ్యులు కూడా సభకు రాకుండా పోయారని రేవంత్ రెడ్డి అన్నారు.

నమ్మకంతో సభకు పంపితే...
ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో గెలిపించి పంపితే సభకు గత రెండేళ్లుగా ప్రతిపక్ష నేత సభకు రావడం లేదన్నారు. సభలో ప్రతిపక్ష నేతగా మాట్లాడకుంటే నాలుగు కోట్ల ప్రజలకు నష్టం జరుగుతుందని తెలిసినా ఆయన సభకు రావడం లేదన్నారు. వారి అనుభవాల నుంచి సూచనలు ఇవ్వాలని కోరినా సభకు రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. తాము కృష్ణా నదీ జలాలపై సభ పెట్టాలని తాము కోరుకోలేదని, కేసీఆర్ పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపైనే ఈ సభను పెట్టడం జరిగిందన్నారు. బట్టలూడతీస్తామని, తోలుతీస్తామన్నవాళ్లు ఇప్పుడు సభకు ఎందుకు రాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నీళ్ల కోసం కొట్లాడిన ప్రాంతమైన తెలంగాణలో బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం మూడు రాష్ట్రాలకు కృష్ణానదీ జలాల కేటాయింపు జరిగిందని అన్నారు. గోదావరి, కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసుకుని జలవివాదాలను పరిష్కరించుకోమన్నారు.
కృష్ణా జలాల విషయంలో...
కేసీఆర్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేశారని అన్నారు. కృష్ణా నది జలాల పంపకాల కోసం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ను 2004లో ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటివరకూ నీళ్ల పంచాయతీ తెగలేదన్నారు. కర్ణాటక ఆల్మట్టి ఎత్తును పెంచాలనుకుంటోందని,అందుకే కర్ణాటక ప్రభుత్వంతో కొట్లాడాలంటే ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధులు కలసికట్టుగా నడవాలన్నారు. 811 టీఎంసీలకు అనుమతులున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు.490 టీఎంసీలకు తెలంగాణకు అనుమతి వస్తే తెలంగాణ ప్రజల నీటి వాటాను ఆంధ్రప్రదేశ్ వద్ద కేసీఆర్ తాకట్టు పెట్టారని అన్నారు. చేసిందంతాచేసి తప్పులన్నీ తమపై రుద్దాలని ప్రయత్నించాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. చరిత్రను వక్రీకరించలేరని, అలాగే రికార్డులను కూడా ఎవరూ చేరిపేయలేరని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.










Tags:    

Similar News