బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే ప్రయత్నిస్తా
అమెరికా బీమా కంపెనీలకు బీజేపీ ప్రభుత్వం బ్రోకర్లుగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
అమెరికా బీమా కంపెనీలకు బీజేపీ ప్రభుత్వం బ్రోకర్లుగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఉద్యమిస్తామని చెప్పారు. ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలని కేసీఆర్ ప్రశ్నించారు. బడ్జెట్ లో నదుల అనుసంధానానికి ఎలా నిధులు కేటాయిస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. ఆ అధికారం ఎవరిచ్చారన్నారు. గోదావరి ట్రైబ్యునల్ పై సుప్రీంకోర్టులో కేసు ఉందని చెప్పారు. బడ్జెట్ లో ఎవరికీ న్యాయం జరగలేదన్నారు. ఘోరమైన పద్ధతితో దేశాన్ని నాశనం చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నట్లు అని ఆయన ప్రశ్నించారు.
దేశాన్ని అమ్మేందుకే....
బీజేపీ పాలన అంటే దేశాన్ని అమ్మడమేనని అన్నారు. దేశం అభివృద్ధి సాధించాలంటే ఈ పార్టీని తరిమికొట్టాల్సిందేనని కేసీఆర్ చెప్పారు. విదేశాల్లోని నల్లధనం తెస్తామని చెప్పారు. తెచ్చారా? అని ప్రశ్నించారు. బీజేపీ అంటే నమ్మ ఓట్లేసి అమ్మేయడమేనని ఎద్దేవా చేశారు. ఎయిర్ ఇండియాను అమ్మేసిన కేంద్రం ప్రభుత్వం వరసగా అన్ని ప్రభుత్వ సంస్థలను అమ్మేందుకు ప్రయత్నిస్తంుదని చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి పెట్టుబడిని రెట్టింపు చేశారని కేసీఆర్ అన్నారు. ఒక్కొక్కరికి పదిహేను లక్షలు ఇస్తామన్నారు. ఇచ్చారా? అని నిలదీశారు.
మోదీది సంకుచిత మనస్తత్వం....
ప్రధాని మోదీది సంకుచిత పాలన అని చెప్పారు. క్రిప్టో కరెన్సీని ఎలా గుర్తిస్తారు? అధికారికంగా గుర్తించారా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గోల్ మాల్ బడ్జెట్ అని చెప్పారు. బీజేపీకి సిగ్గూ, శరం లేదని ఫైర్ అయ్యారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ హైదరాబాద్ కు వస్తే మోదీకి నిద్రపట్టలేదన్నారు. అహ్మదాబాద్ లో పెట్టకుండా హైదరాబాద్ లో ఎందుకు పెడుతున్నారని మోదీ బాధపడ్డారన్నారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం తాను ఇంతవరకూ చూడలేదన్నారు. వీళ్లకు పాలసీ లేదు పాడు లేదన్నారు. కేంద్ర బడ్జెట్ పైన పటారం.. లోన లొటారం అన్నారు. మహా భారతంలో శాంతిపర్వంలోని శ్లోకం చెప్పేటప్పుడు ఆర్థిక మంత్రి ఆత్మ శోకించలేదా? అని ప్రశ్నించారు.
అంతా బోగస్ ....
జలశక్తి మిషన్ అంతా బోగస్ అని కేసీఆర్ అన్నారు. ఆదాయాన్ని కాదు పెట్టుబడి వ్యయాన్ని రెట్టింపు చేశారని అన్నారు. ఎస్టీ, ఎస్ఠీలకు బడ్జెట్ లో కేంద్రం 12,800 కోట్లు కేటాయించిందన్నారు. ఒక్క తెలంగాణలోనే వారి కోసం 33 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రామానుజ చార్యుల విగ్రహానికి ఆ ట్రస్ట్ ఎంతో కష్టపడి నిర్మిస్తే యూపీ ఎన్నికలలో దానిని తమ ఘనతగా బీజేపీ నేతలు చాటుకుంటున్నారు. ప్రజలకు మత పిచ్చి లేపి ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత యువతదేనని చెప్పారు. దేశాన్ని విభజించి పాలించాలని భావిస్తున్నారని చెప్పారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చిన సాయం ఒక్క దళితుబంధుకు సాటిరాదన్నారు. స్థానికులే ఉద్యోగాలు రావాలని 317 జీవోను తెచ్చామని చెప్పారు.