Telangana : తెలంగాణ బీజేపీ ప్రక్షాళన తప్పదా? నాయకత్వం సిద్ధమైనట్లేనా?
తెలంగాణ బీజేపీ నేతలపై ఎప్పటికప్పుడు కేంద్ర నాయకత్వం నివేదికలు తెప్పించుకుంటునట్లే ఉంది
తెలంగాణ బీజేపీ నేతలపై ఎప్పటికప్పుడు కేంద్ర నాయకత్వం నివేదికలు తెప్పించుకుంటునట్లే ఉంది. ఇక్కడ నేతల మధ్య సమన్వయం లేదు. ఒకరంటే ఒకరికి పడదు. పార్టీ నాయకత్వం పటిష్టంగా ఉన్నప్పటికీ, ఓటు బ్యాంకు బలంగా ఉన్నా వాటిని పార్టీకి అంటుకుపోయేలా చేయడంలో మాత్రం నాయకత్వం విఫలమవుతున్నట్లు కేంద్ర నాయకత్వానికి నిఘా నివేదికలు అందినట్లే అర్ధమవుతుంది. నాయకుల మధ్య ఆధిపత్య పోరు పార్టీని బలోపేతం చేయలేకపోతుందన్న భావన కేంద్ర నాయకత్వంలో కనిపిస్తుంది. కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నప్పటకీ, ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులున్నా, ఎనిమిది మంది శాసనసభ్యులున్న కార్యకర్తల విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తుందని పసిగట్టింది.
నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో...
అందుకే ఈరోజు తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకినట్లు చెబుతున్నారు. కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేక పోతున్నారని మోదీ అసంతృప్తి వ్యక్తం చేయడం వెనక ఆయనకు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. బీజేపీ అధ్యక్షుడిగా కొన్నాళ్ల క్రితం రామచందర్ రావును నాయకత్వం నియమించింది. అయితే రామచందర్ రావుకు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు సహకరించడం లేదని కేంద్ర నాయకత్వానికి అందుతున్న నివేదికలను బట్టి అర్థమవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ పేలవమైన ప్రదర్శన చూపడం వెనక నేతల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని కేంద్ర నాయకత్వానికి స్పష్టంగా తెలుస్తుంది. పాత, కొత్త నేతల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతున్నట్లు నాయకత్వం గుర్తించింది.
త్వరలో ఢిల్లీ నుంచి పిలుపు...
తెలంగాణలో బీజేపీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి కేంద్ర నాయకత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అనేక అవకాశాలున్నప్పటకీ ఆ అవకాశాలను వినియోగించుకోక పోగా ప్రత్యర్థి పార్టీలకు కొందరు నేతలు అనుకూలంగా వ్యవహరిస్తున్న అనుమానం కూడా బీజేపీ అగ్రనేతల్లో వ్యక్తమవుతుంది. అందుకే మోదీ ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. కేంద్రమంత్రులు ఇద్దరి మధ్య కూడా సమన్వయం లేకోవడాన్ని గుర్తించిన కేంద్ర నాయకత్వం, సరైన దిశలో పయనించేలా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అందులో తమ అభిప్రాయాలను కుండబద్దలు కొడతారని సమాచారం.