Telangana: స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలను తీసుకుంది.

Update: 2025-10-17 02:24 GMT

తెలంగాణ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలను తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు వర్తిస్తున్న ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నిబంధన ప్రకారం ఇద్దరికి మించిన పిల్లలు ఉన్నవారు ఎంపీటీసీ, జడ్‌పీటీసీ, వార్డు సభ్యుడు, సర్పంచ్‌ పదవులకు పోటీ చేయలేకపోయేవారు. వివిధ వర్గాల అభ్యర్థనల నేపథ్యంలో ఈ ఆంక్షను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు ఈ విషయాన్ని మీడియాకు వివరించారు.

న్యాయనిపుణుల సూచన మేరకు...
సుప్రీం కోర్టు తీర్పుతో న్యాయనిపుణులు సూచించిన మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. రెండు రోజుల్లో బీసీ రిజర్వేషన్లు, సుప్రీంకోర్టు తీర్పు పై న్యాయనిపుణులు నివేదిక సమర్పించాలని సమావేశం కోరింది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను తిరస్కరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. అక్టోబర్‌ 23న జరిగే తదుపరి కేబినెట్‌ సమావేశంలో ఈ అంశంపై చట్టపరమైన అంశాలను న్యాయ నిపుణుల సలహాతో పరిశీలించనున్నట్లు తెలిపారు.
మెట్రో రెండో దశపై చర్చ
హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు పురోగతిపై మంత్రి వర్గ సమావేశం విస్తృతంగా చర్చించింది. ఈ దశ అమలుకు కేంద్రం విధించిన షరతులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ప్రాజెక్టును చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యతలపై చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో అధికారుల కమిటీ ఏర్పాటుచేసింది. కమిటీ నివేదిక ఆధారంగా ఉపముఖ్యమంత్రి నేతృత్వంలోని కేబినెట్‌ సబ్ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత ముందుకెళ్లాలని అభిప్రాయపడింది.
వ్యవసాయ రంగానికి ఊతం
ఈ సీజన్‌లో రాష్ట్రంలో సుమారు 1.48 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం 50 లక్షల టన్నులకే పరిమితం చేస్తామని స్పష్టం చేసిందన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరతో పాటు ఫైన్‌ రైస్‌పై క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హుజూర్ నగర్‌, కొడంగల్‌, నిజామాబాద్‌లలో మూడు కొత్త వ్యవసాయ కళాశాలలు స్థాపనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 5,566 కిలో మీటర్ల రహదారులను రూ.10,547 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.


Tags:    

Similar News