ప్రపంచశాంతికి బౌద్ధమే మార్గం: సునీల్ సెనేవి
యుద్ధాల నేపథ్యంలో శాంతికి బుద్ధ బోధనలు అవసరమన్న మంత్రి బుద్ధవనాన్ని ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న జూపల్లి
హైదరాబాద్: ప్రపంచం యుద్ధ వాతావరణంలో తలమునకలై ఉన్న ఈ సమయంలో శాంతికి బౌద్ధమే సరైన మార్గమని శ్రీలంక బుద్ధశాసన, సాంస్కృతిక శాఖ మంత్రి ఆచార్య హినీదుమె సునీల్ సెనేవి అన్నారు. బేగంపేట్‌లోని ది ప్లాజా హోటల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఋద్ధవనం, వియత్నాం బౌద్ధ సంఘం కలిసి ఈ సదస్సును నిర్వహించాయి. సదస్సును బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య స్వాగత ప్రసంగంతో ప్రారంభించారు.
తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక వలయాన్ని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. బుద్ధవనాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బుద్ధుని బోధనలు ఆచరిస్తే శాంతి సహజంగానే వస్తుందని పేర్కొన్నారు.
వియత్నాం బౌద్ధ సంఘ అధ్యక్షుడు తిచ్ నాత్ తు మాట్లాడుతూ శాంతి ముందుగా మనిషి మనసులోనే మొదలవుతుందని అన్నారు. అది సమస్యల పరిష్కారానికి దారి చూపుతుందని చెప్పారు.
నవనలంద మహా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సిద్ధార్థ సింగ్ మాట్లాడుతూ మంచి ఆలోచనలు, మంచి చర్యలు మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని తెలిపారు. సమాజ మేలు కోసం ఐక్యరాజ్యసమితి ఏర్పాటైందని, బౌద్ధాన్ని ఆచరిస్తే యుద్ధాలకు చోటు ఉండదన్నారు.
ఈ సదస్సులో శ్రీలంక బౌద్ధ భిక్షు ఆచార్య కసప్ప మహాథేరో, రష్యా బౌద్ధ సంఘ అధ్యక్షుడు అండ్రే దొందుకుబెవ్, లావోస్ కేంద్ర బౌద్ధ సంఘ అధ్యక్షుడు వంఖరి వాంగ్ ససులిన్, మహాబోధి సొసైటీ జనరల్ సెక్రటరీ ఆనంద బిక్కు ప్రసంగించారు.
బౌద్ధ సంస్కృతి పరిరక్షణలో చేసిన కృషికి గుర్తింపుగా శ్రీలంక మంత్రి సునీల్ సెనేవి, జూపల్లి కృష్ణారావు, మల్లేపల్లి లక్ష్మయ్య, తిచ్ నాత్ తు లకు అంతర్జాతీయ అవార్డులు ప్రదానం చేసి మూన్ యాంగ్ జో సత్కరించారు.
22 దేశాల నుంచి 80 మంది ప్రతినిధులు పాల్గొన్నట్లు మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ముగింపు సమావేశంలో ప్రకటించిన ‘పీస్ డిక్లరేషన్’కు విస్తృత మద్దతు లభించిందన్నారు.