. KCR : కేసీఆర్ చేయబోయే కీలక ప్రకటన అదేనటగా.. అంతటా ఉత్కంఠ
బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు రేపు వరంగల్ లో జరగనున్నాయి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఏం మాట్లాడనున్నారు? బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు రేపు వరంగల్ లో జరగనున్నాయి. ఈ సభకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు ఐదు లక్షలకు మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశముందని చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. అయితే ఆయన కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేయడం మామూలే. ఎందుకంటే రెండు పార్టీలను తెలంగాణ ప్రజలు తిరస్కరించాలని ఈ వేదికగా పిలుపు నివ్వనున్నారు. అదే సమయంలో పార్టీ పరంగా కీలక నిర్ణయం ప్రకటించే అవకాశముందని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేటికీ కేసీఆర్ ను అభిమానించే వాళ్లు లక్షల్లో ఉన్నారు. ఆయన వల్లనే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని భావించే వారు అనేక మంది ఉన్నారు.
తెచ్చింది కేసీఆర్ అని...
ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ అంటే రాజకీయాల్లో ఒక బ్రాండ్. ఆయన కేవలం తన మాటలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చేట్లు చేయడంలో ప్రధాన పాత్రపోషించారన్నది కూడా వాస్తవం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ తెచ్చింది ఎవరు అంటే? మాత్రం అందరి వేళ్లు గులాబీ బాస్ వైపు చూపతాయి. అందుకే కేసీఆర్ కు రాజకీయాల్లో ఒక ప్రత్యేకత ఉంది. 2001లో బీఆర్ఎస్ పార్టీని స్థాపించినా ఎన్నో కష్టాలు, ఎదురుదెబ్బలు తగిలినా కూడా చలించకుండా ముందుకు సాగారు. నేతలు పార్టీని వీడివెళ్లడంతో పాటు పదేళ్ల పాటు అధికారంలోకి రాలేకపోవడంతో ఉప ఎన్నికలకు వెళ్లి సత్తా చాటారు. 2014 నుంచి వరసగా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలను అమలులోకి తెచ్చారు. అదే సమయంలో రాష్ట్రాన్ని విద్యుత్తు పరంగా ముందు వరసలో నిలిపారనడంలో ఎలాంటి సందేహం లేదు.
పదేళ్ల పాలనలో...
అయితే కేసీఆర్ పదేళ్ల పాలన కొందరికి ఇబ్బందిగా మారింది. కేవలం ఆయన ప్రగతి భవన్ కే పరిమితమవ్వడంతో పాటు కుటుంబ సభ్యుల జోక్యం, నియంతలలా వ్యవహరించడం, ఆందోళనలకు కూడా అవకాశమివ్వకపోవడం ఒకింత మైనస్ గా మారాయి. తెలంగాణ ప్రజలు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారికి కనీసం ఆందోళన తెలిపే స్వేచ్ఛ కూడా లేకుండా చేయడం జనాలను గులాబీ పార్టీ దూరమయింది. మరోవైపు తమ ఇంటిపార్టీగా భావించిన టీఆర్ఎస్ ను 2023 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గా మార్చడం కూడా ప్రజలు స్వాగతించలేకపోయారు. తెలంగాణ పార్టీ కాదని, వేరే ప్రయోజనాలను ఆశించి దీనినివిస్తరించారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నెలకొంది. దీంతో పాటు ఒక్కసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశమివ్వాలని కూడా ప్రజల్లో కలిగిన ఆలోచనతో బీఆర్ఎస్ ఓటమి పాలయింది.
వరంగల్ వేదికగా...
ఫలితంగా మొన్నటి ఎన్నికల్లో అధికారానికి దూరమయింది. అదే సమయంలో పార్లమెంటు ఎన్నికల సమయానికి కూడా అది పుంజుకోలేకపోయింది. ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో ఇక ఈ వరంగల్ సభ నుంచి బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా కేసీఆర్ మారుస్తారని, ప్రజలు కోరుకుంటున్నదదే కావడంతో పాటు తాను కూడా ఇక నేలవిడిచి సాము చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు ప్రచారం పెద్దయెత్తున జరుగుతుంది. ప్రసంగాలతో నే కాదు.. ఇక చేతల్లోనూ చూపించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని సమాచారం. అందుకే బీఆర్ఎస్ పార్టీని తిరిగి టీఆర్ఎస్ గా మార్చడం ఒక కీలక ప్రకటన ఈ సభ ద్వారా చేస్తారని తెలిసింది. మొత్తం మీద కేసీఆర్ రేపు మాట్లడే అవకాశముందని అంటున్నారు. అదే సమయంలో పార్టీలో కూడా సమూల ప్రక్షాళనతేవడంతో పాటు అన్ని వర్గాలకు స్థానం కల్పించేలా నిర్ణయం తీసుకోనున్నారు.