Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత కోరుకుంటున్నదదేనా? ఆ ఒక్కటీ అడక్కు అని గులాబీ బాస్ అంటున్నారా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డైరెక్ట్ గా బీఆర్ఎస్ నేతలపై మాటల దాడికి దిగారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై నేరుగా ఆమె ఆరోపణలు చేశారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డైరెక్ట్ గా బీఆర్ఎస్ నేతలపై మాటల దాడికి దిగారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై నేరుగా ఆమె ఆరోపణలు చేయడం చూస్తుంటే ఆమె పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నట్లు కనపడుతుంది. జగదీశ్వర్ రెడ్డిని లిల్లీపుట్ గా అభివర్ణిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు కారు పార్టీలో కలకలం రేపాయి. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఉద్యమకాలం నుంచి ఆయన కేసీఆర్ వెన్నంటే ఉన్నాడు. ఆ విషయం కవితకు తెలియంది కాదు. అదే సమయంలో తన సోదరుడు కేటీఆర్ కు కూడా జగదీశ్వర్ రెడ్డి ఆప్తమిత్రుడని కవితకు తెలుసు. అందుకే ఇక నేరుగా ఎటాక్ చేయడం ప్రారంభించినట్లుంది.
జగదీశ్ రెడ్డిపై నేరుగా...
అయినా సరే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనుచాిత వ్యాఖ్యలు చేసిన వారిని కొందరు వెనకేసుకు వస్తున్నారన్ని అన్నారు. లిల్లీపుట్ నాయకుడు అంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై ఆమె మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో పార్టీని నాశనం చేసిన వాళ్లు తనపై బురద జల్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నల్లగొండలో చచ్చీచెడీ .. చావుతప్పి కన్నులొట్ట పోయి ఒక్కడే గెలిచారని అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నా బీఆర్ఎస్ నేతలు స్పందించలేదని అన్నారు. లిల్లీపుట్ నాయకుడు వల్లనే తనపై ట్రోల్స్ చేస్తున్నా స్పందించడం లేదన్నారు. నేడు కూడా జగదీశ్ రెడ్డి ఎర్రవెల్లి లోని ఫామ్ హౌస్ కు జగదీశ్వర్ రెడ్డి వెళ్లపోతున్నారు.
అది తేలేవరకూ...
తాను కేసీఆర్ కు రాసిన లేఖ బయటపెట్టింది ఎవరన్నది తేలేవవరకూ తాను పార్టీకి దూరంగా ఉంటానని కల్వకుంట్ల కవిత చెప్పడం చూస్తే తాను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలనే ఉద్దేశ్యం ఆమెలో స్పష్టంగా కనిపిస్తుంది. తనంతట తాను రాజీనామా చేయకుండా పార్టీ కనుక సస్పెండ్ చేస్తే తనకు సానుభూతి మాత్రం పుష్కలంగా లభిస్తుందని కవిత అంచనా వేస్తున్నారు. అందుకే ఇన్నాళ్లు కేసీఆర్ చుట్టూ దయ్యాలు.. అంటూ వ్యాఖ్యలు చేసిన కవిత ఇప్పుడు నేరుగా జగదీశ్వర్ రెడ్డిని టార్గెట్ చేయడం చూస్తుంటే తాను సస్పెండ్ కావాలని కోరుకుంటున్నట్లు కనపడుతుంది. తన కోపమంతా సోదరుడు కేటీఆర్ పైనే. అయితే నేరుగా కేటీఆర్ పేరు ప్రస్తావించకుండా జగదీశ్వర్ రెడ్డి పేరుతో విమర్శలకు దిగి ఒకరకంగా పార్టీ నాయకత్వానికి సవాల్ విసిరారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో...
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కల్వకుంట్ల కవిత స్పీడ్ పెంచారని ఎవరికైనా ఇట్లే అర్థమవుతుంది. టీవీ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన ప్రయాణంపై కూడా ఆమె స్పష్టత నిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరొకవైపు బీఆర్ఎస్ కూడా ఆచితూచి కవిత విషయంలో వ్యవహరిస్తుంది. తాము పట్టించుకోనట్లు వదిలేసినా, కవిత కాలు దువ్వడానికి కారణం గుర్తించి నాయకత్వం కూడా నెమ్మదిగానే అడుగులు వేయాలని నిర్ణయించినట్లుంది. అందుకే కవిత తనపై చేసిన విమర్శలకు జగదీశ్వర్ రెడ్డి చాలా హుందాగా సమాధానమిచ్చారు. సంయమనం ప్రదర్శించారు. కేసీఆర్ ను కలసి వచ్చిన తర్వాత మీడియా సమావేశం పెట్టి జగదీశ్వర్ రెడ్డి తన ఉద్యమ ప్రస్తానంపై కవితమ్మకు ఉన్న జ్ఞానానికి జోహార్లని, ఆమె చేసిన ప్రయత్నాలకు తాను సానుభూతిని తెలియచేస్తున్నానని మాత్రమే చెప్పి వదిలేశారు. దీన్ని బట్టి చూస్తుంటే కవిత విషయంలో కాస్త ఓపిగ్గా వేచి చూడటమే బెటరని గులాబీ పార్టీ అధినేత భావిస్తునట్లు స్పష్టంగా కనపడుతుంది.