Kalvakuntla Kavitha : కవిత ఇక సిద్ధమయ్యారా? సోదరుడిని లక్ష్యంగా చేసుకున్నట్లుందిగా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీకి ఇబ్బందికరంగా మారారు. ఇక ఆమె నేరుగా యుద్ధానికే దిగేందుకు సిద్ధమయినట్లు కనపడుతుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీకి ఇబ్బందికరంగా మారారు. ఇక ఆమె నేరుగా యుద్ధానికే దిగేందుకు సిద్ధమయినట్లు కనపడుతుంది. గతంలో ఆఫ్ ది రికార్డుగానే విమర్శలు చేసే కల్వకుంట్ల కవిత ఈసారి మాత్రం బహిరంగ లేఖలతో బయటపడటం చూస్తుంటే కవిత ఎగ్జిట్ కు సిద్ధమయినట్లు కనిపిస్తుంది. తాను తగ్గేది లేదన్నట్లుగా ఆమె వ్యవహారశైలి ఉంది. బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్న కల్వకుంట్ల కవిత తనను టీజీబీకేఎస్ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కు దూరమయిన కవిత ఇక బీఆర్ఎస్ కు కూడా దూరమవుతారా? అన్న సందేహాలు నెలకొన్నాయి.
పదవి నుంచి...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. సింగరేణి కార్మిక సంఘం నుంచి తనను తొలగించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను తాను బయటపెట్టడమే తనపై ఈ కక్ష సాధింపు చర్యలు అని నేరుగా ఆరోపించారు టీజీబీకేఎస్ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తాను అమెరికా వెళ్లినప్పుడు తొలగించడమేంటని కవిత ప్రశ్నిస్తూనే గతంలో తనపై కుట్ర చేసిన వారే ఈ కుట్రకు కూడా పాల్గొన్నారు. ఆ కుట్రదారులే తనను అన్ని రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని కవిత ఆరోపించి ఒకరకంగా బీఆర్ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టారు. ఇక కవిత ఆరోపణలను కొట్టిపారేయకుండా చూస్తూ ఊరుకుంటే పార్టీ పట్ల ప్రజల్లో వేరే రకమైన అభిప్రాయం ఏర్పడుతుందని పలువురు గులాబీపార్టీ నేతలు నమ్ముతున్నారు.
కుట్రదారులంటూ...
గతంలో తాను అమెరికాకు వెళ్లినప్పుడు గతంలో పార్టీ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖను బయటపెట్టారని, ఇప్పుడు అమెరికాకు వెళ్లినప్పుడు కార్మిక సంఘం గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగించారని కవిత ఆరోపించారు. గతంలో తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టాలో చెప్పాలని తాను ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నానని అన్నారు. తాను అమెరికాకు వెళ్లినప్పుడే పదవి నుంచి తొలగించడం కుట్రలో భాగమేనని అన్నారు. మొన్నామధ్య పార్టీ నేత జగదీశ్వర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన కవిత ఈసారి మాత్రం కుట్రదారులంటూ కొత్త వాదనకు తెరదీశారు. ఒకరకంగా చెప్పాలంటే తన సోదరుడు కేటీఆర్ పై ఈసారి బాణాలు ఎక్కుపెట్టినట్లు అర్థమవుతుంది. దీంతో అన్నా చెల్లెళ్ల రాజకీయ యుద్ధం వీధిన పడిందన్న వార్తలు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్నాయి.