Telangana : పొత్తులు బోర్డర్ దాటి రావడానికి వీల్లేదట.. సోలో పోటీ.. సో బెటర్
తెలంగాణ బీజేపీ ఒక విషయంలో మాత్రం స్పష్టంగా ఉంది. ఏ ఎన్నిక జరిగినా ఒంటరి పోరాటానికే సిద్ధమవుతుంది
తెలంగాణ బీజేపీ ఒక విషయంలో మాత్రం స్పష్టంగా ఉంది. ఏ ఎన్నిక జరిగినా ఒంటరి పోరాటానికే సిద్ధమవుతుంది. మిగిలిన పార్టీల నేతలను తమలో కలుపుకుని మరింత బలోపేతమై తెలంగాణ రాష్ట్రాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తుంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అందుకు ససేమిరా అంగీకరించడం లేదు. సొంతంగా తెలంగాణలో ఎదగడమే దాని అసలు లక్ష్యంగా కనిపిస్తుంది. రాష్ట్ర నాయకులు మాత్రమే కాదు.. కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయంలో ఒకే మాట.. ఒకే తీరు. తమకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదన్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేస్తున్నారంటే బీజేపీ లో అంత కాన్ఫిడెన్స్ ఎందుకు పెరిగిందన్న దానిపై రాజకీయంగా చర్చ జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఒంటరి పోరు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్ర విభజనకు ముందు...
2014కు ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేవి. అప్పుడు పార్టీ అధ్యక్ష పదవిలో ఎవరున్నప్పటికీ రెండు చోట్ల పెద్దగా పార్టీకి ఎదుగుదల కనిపించలేదు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాత్రం ఆంధ్రప్రదేశ్ లో తన బలాన్ని ఏ మాత్రం పెంచుకోలేకపోయింది. అయితే అక్కడ కూటమిని కట్టింది. తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలసి అధికారంలోకి రాగలిగింది. అవసరమైన స్థానాలను పొందగలిగింది. రాష్ట్ర విభజన జరిగిన తొలి ఎన్నికలోనూ టీడీపీ, బీజేపీ కలసి పోటీ చేసి అధికారంలోకి రాగలిగాయి. 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేసి ఓటమిని చవిచూశాయి. బీజేపీకి అయితే ఒక్క శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే 2024 ఎన్నికల్లో మూడు పార్టీలు కలసి సూపర్ విక్టరీని సాధించాయి.
సొంతంగా గ్రాఫ్ పెంచుకునేలా...
ఇక తెలంగాణలోకి వచ్చేసరికి బీజేపీ గ్రాఫ్ సొంతంగా పెంచుకుంటూ పోతుంది. 2014 ఎన్నికల్లో కొన్ని సీట్లను గెలిచిన బీజేపీ 2018 శాసనసభ ఎన్నికల్లో మాత్రం కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే 2023 ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాల్లో గెలిచింది. అలాగే 2024 పార్లమెంటు ఎన్నికల్లోనూ ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి మరింత గ్రాఫ్ ను మెరుగుపర్చుకుంది. అందుకే ఏపీలో కూటమి ఉన్నప్పటికీ, తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీ, జనసేనలతో పొత్తు ఉండబోదని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలు సీమాంధ్రకు చెందిన పార్టీలుగా గుర్తింపు పొందడంతో దూరం పెట్టారన్నది వాస్తవం.
ఉప ఎన్నికలో సయితం...
వచ్చే నెలలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది.ఈ ఎన్నికలోనూ బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవన్నది పార్టీ నేతల అభిప్రాయంగా ఉంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో టీడీపీతో పాటు సినిమా వాళ్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీలతో పొత్తుకు కమలనాధులు సిద్ధంగా లేరన్నది వాస్తవం. ఒక్కసారి పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా ఆంధ్ర సెంటిమెంట్ ను ప్రత్యర్థులు పైకి ఎగదోసే అవకాశముందని భావించి పొత్తు లేదని ముందుగానే నేతలు కుండబద్దలు కొట్టేస్తు్న్నారు. కూటమి అంత వరకే ఉంటుందని, బార్డర్ దాటి ఇటు వైపు మాత్రం రాదని తెలంగాణ బీజేపీ నేతలు నమ్మకంగా చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఒంటరిపోరాటమేనని స్పష్టం చేస్తున్నారు.