Summer Warning : హెచ్చరిక...పది రోజులు బయటకు రాకండి.. వస్తే మాడి మసైపోతారంతే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉన్నాయంటే బయటకు వెళ్లారంటే మాడి మసిపోతారంతే అన్నట్లుగా గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులు వీస్తున్నాయి. సెగతో ఇంట్లో ఉండలేక.. వేడికి బయటకు రాలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు జనం. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితులు లేవు. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకూ ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వడదెబ్బ తగిలి ఆసుపత్రి పాలయ్యే అవకాశాలున్నాయి. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు.
వానల తర్వాత మరింతగా...
ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ కురుస్తున్న చిరుజల్లులు ఏ మాత్రం ఉపశమనం కలిగించడం లేదు. పగటి పూట ఎండల తీవ్రత.. సాయంత్రం వేళ చిరుజల్లులతో మరింత ఎండల తీవ్రత పెరుగుతుంది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వానలు పడతాయని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ, పల్నాడు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నలభై నుంచి నలభై నాలుగు డిగ్రీలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాను రాను ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, ప్రజలు అలెర్ట్ గా లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
అలెర్ట్ గా ఉండండి.. ప్రాణాలు కాపాడుకోండి...
తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం ఏడు గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఈ నెల 12 అంటే నేటి నుంచి 22వ తేదీ వరకూ ఎవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, 45 డిగ్రీలు దాటే ఛాన్స్ ఉందని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఏవైనా పనులుంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత మాత్రమే బయటకు వచ్చి వెళ్లిపోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. ప్రధానంగా కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సో.. అలెర్ట్ గా ఉండండి.. ప్రాణాలు కాపాడుకోండి.