వాళ్లంతా వీళ్లే

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది

Update: 2023-09-13 07:07 GMT

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరగడం పార్టీ అగ్రనాయకత్వానికి ఒకింత ఆనందం వేస్తున్నప్పటికీ, దరఖాస్తుదారులంతా చోటామోటా నేతలే కావడం పట్ల ఒకింత నిరాశ కూడా కలుగుతుంది. పేరున్న నేతలు ఇప్పటి వరకూ భారతీయ జనతా పార్టీలో చేరకపోవడంతో పాటు సీనియర్ నేతలు కూడా ఎవరూ ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకోకపోవడం ఒకింత ఆందోళన కల్గించే అంశంగానే చూడాలి.

ఎక్కువ మంది...
కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి దరఖాస్తులు స్వీకరించింది. అయితే దరఖాస్తుదారుల నుంచి పెద్దమొత్తంలో ఫీజు వసూలు చేసింది. దీంతో బలమైన నేతలే ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని ముందుకు వచ్చారు. కానీ బీజేపీ దరఖాస్తులకు ఎలాంటి ఫీజు పెట్టకపోవడంతో ఇబ్బడి ముబ్బడిగా తాము పోటీ చేస్తామని ముందుకు వస్తున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎదుర్కొనే సత్తా లేదని గ్రహించిన అధినాయకత్వం ఆందోళనకు గురవుతుంది.
సరైన అభ్యర్థులు...
కార్పొరేటర్ స్థాయి నుంచి గల్లీ లీడర్ల వరకూ దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. రావడానికి ఆరువేల అప్లికేషన్స్ వచ్చినప్పటికీ అందులో సరైనోళ్లు మాత్రం నేతలకు కనపడటం లేదట. అందుకే కొన్ని దరఖాస్తులను పరిశీలించే అవకాశం లేకుండానే పక్కన పెట్టేస్తున్నారట. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు సరైన అభ్యర్థులు దొరకాలంటే అంత ఆషామాషీ కాదు. అంగ, అర్థ బలం ఉన్న నేతలు కమలం పార్టీలో అతి స్వల్పంగానే ఉన్నారు. ఇరవై ముప్ఫయి నియోజకవర్గాలకు మించి ఎక్కడా సరైన క్యాండిడేట్ లేరన్నది వాస్తవమే. అయితే అధికార పార్టీపై వ్యతిరేకత, మోదీ ఇమేజ్ తో గెలుస్తారన్న నమ్మకంతోనే వీరంతా దరఖాస్తు చేసుకోవడానికి ముందుకు వచ్చినట్లు తెలిసింది.
అమిత్ షా రాకతో...
దీంతో పాటు ఒకసారి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే ఓటమి పాలయినా పార్టీ పదవులతో పాటు రాజకీయంగా ఎదుగుదల ఉంటుందని కూడా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నెల 16వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. 17న జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ముఖ్యనేతలతోనూ ఆయన సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారని తెలిసింది. చేరికలు పెద్దగా లేకపోవడంపై ఇటీవల తెలంగాణ వచ్చిన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారైనా అమిత్ షా సమక్షంలో చేరికలు ఉంటాయా? లేదా? అన్నది చూడాలి. ఇటు చేరికలు, అటు అభ్యర్థిత్వాల పై అమిత్ షా సీనియర్ నేతలతో చర్చిస్తారని తెలిసింది.



Tags:    

Similar News