Hyderabad ఇక రియల్ రంగం పరుగులు పెట్టనుందా? కారు చౌకగా హైదరాబాద్ లో ఫ్లాట్లు లభిస్తాయా?
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగం ఇక వేగంగా పరుగులు చేసే అవకాశముంది
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగం ఇక వేగంగా పరుగులు చేసే అవకాశముంది. జీఎస్టీ తగ్గింపుతో రియల్ బూమ్ మరింత పెరిగే అవకాశముందన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటివరకూ ముడిసరుకుల ధరలు ఎక్కువగా ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగంలో అనేక వెంచర్లు వినియోగదారులకు భారంగా మారాయి. కొనుగోలు చేయాలంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి రావడంతో చాలా మంది వెనక్కు తగ్గుతున్నారు. మరొకవైపు అమెరికాలో నెలకొన్న పరిణామాలతో కూడా రియల్ రంగంపై ప్రభావం చూపింది.
ఫ్లాట్ల ధరలు...
అయితే తాజాగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో అపార్ట్ మెంట్ల ధరలు భారీగా తగ్గే అవకాశముందని చెబుతున్నారు. అయితే అదే సమయంలో ప్రాంతాన్ని బట్టి ధరలు మారే అవకాశమున్నప్పటికీ చాలా వరకూ ధరలు తగ్గి కొనుగోలు చేసే వారికి అందుబాటులోకి వచ్చే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. సిమెంట్ , స్టీల్ వంటి కీలక నిర్మాణ సామగ్రి పై జీఎస్టీని 28% నుంచి 18%కు తగ్గించడం ద్వారా నిర్మాణ వ్యయం చాలా వరకూ తగ్గనుండటంతో ఫ్లాట్ల ధరలు కూడా తగ్గే అవకాశముంది.
లగ్జరీ హౌసింగ్ కు మాత్రం...
దీంతో రియల్ రంగం పుంజుకుంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అయితే లగ్జరీ హౌసింగ్ లకు మాత్రం నిరాశజనకంగానే కనిపిస్తున్నాయి. లగ్జరీ విల్లాలు, ఫ్లాట్ల ధరలు మరింత పెరిగే అవకాశముంది. అదే సమయంలో ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు మాత్రం ఊరటనిచ్చే విషయంగా అభివర్ణిస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల రియల్టర్ల లాభాలు మరింత పెరిగి అదనంగా వెంచర్లు కనిపిస్తాయంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అనేక వెంచర్లు కొనుగోలు చేసే వారు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ తో అమరావతి, మిగిలిన ద్వితీయ శ్రేణి నగరాలపై కూడా రియల్ బూమ్ ఊపందుకుంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.