రూ.55.1 లక్షలు 10.75% వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని పసిఫికా ఇండియాకు టిజీ రేరా ఆదేశం

ఆలస్యమైన ‘ఆవాస్ హైదరాబాద్’ ప్రాజెక్టుపై నిర్ణయం వసూలు చేసిన వడ్డీ, మెయింటెనెన్స్‌ ఫీజు పెంపుపై తప్పు పట్టిన రేరా

Update: 2025-10-30 09:56 GMT

హైదరాబాద్‌: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టిజీరేరా) పసిఫికా (ఇండియా) ప్రాజెక్ట్స్‌ కు గట్టి ఆదేశాలు జారీ చేసింది. ఆలస్యమైన ‘ఆవాస్ హైదరాబాద్’ ప్రాజెక్టులో ఫ్లాట్‌ కొనుగోలుదారులు హేమలత లోహుమి, చంద్రశేఖర్‌ లోహుమికి చెల్లించిన రూ.55,10,962 మొత్తాన్ని 10.75% వార్షిక వడ్డీతో తిరిగి ఇవ్వాలని తెలిపింది. ఈ మొత్తాన్ని జూన్‌ 30, 2025 నుండి వాస్తవ రీఫండ్‌ తేదీ వరకు వడ్డీతో కలిపి, 30 రోజుల్లోపు చెల్లించాలని ఆదేశించింది.

ఫ్లాట్‌ విక్రయ ఒప్పందం 2023 ఆగస్టు 16న కుదిరింది. ప్రాజెక్ట్‌ (రెరా నంబర్‌: P02200000223) కింద కన్‌స్ట్రక్షన్‌ లింక్డ్‌ పేమెంట్‌ ప్లాన్‌లో వారు మొత్తం రూ.55.10 లక్షలు చెల్లించారు. అయితే రూ.25.57 లక్షల చెల్లింపులో ఆలస్యం చేశారంటూ సంస్థ రూ.83,283 వడ్డీ వసూలు చేయడాన్ని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ డిమాండ్‌ జూలై 20, 2023న జారీ కాగా, ఆగస్టు 4న చెల్లింపులు జరిపినందున ఆ వసూలు అన్యాయమని టిజీరేరా గుర్తించింది. ఒప్పందంలోని 1.15 క్లాజ్‌ ప్రకారం డిమాండ్‌ వచ్చిన తరువాతే చెల్లింపులు చేయాలనే నిబంధన ఉందని స్పష్టం చేసింది.

ఇక మెయింటెనెన్స్‌ ఛార్జీల విషయంలో రూ.25,830 నుండి రూ.72,334కి పెంచడం ఒప్పందానికి విరుద్ధమని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి అనుమతి లేకుండానే చార్జీలు పెంచినట్లు టిజీరేరా తేల్చింది.

డిసెంబర్‌ 2024లో అప్పగిస్తామని హామీ ఇచ్చిన ప్రాజెక్ట్‌ ఐదు నెలల ఆలస్యమైందని, ఏప్రిల్‌ 2025లో జరిగిన సైట్‌ విజిట్‌లో క్లబ్‌ ఏరియా, కవర్డ్‌ పార్కింగ్‌ వంటి కీలక సదుపాయాలు ఇంకా పూర్తి కాలేదని అధికారం తెలిపింది. ఈ నేపథ్యంలో చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని పసిఫికాకు ఆదేశించింది.


Tags:    

Similar News