ఎస్‌వీబీ ఎస్టేట్స్‌ ₹26 లక్షలు తిరిగి చెల్లించాలని ఆదేశించిన టీజీరేరా

30 రోజుల్లో వినియోగదారునికి వడ్డీతో రీఫండ్‌ చేయాలని ఆదేశం ప్లాట్‌ కేటాయింపులు మారుస్తూ కొనుగోలుదారుడిని తప్పుదారి పట్టించారని ఫిర్యాదు

Update: 2025-11-04 07:59 GMT

హైదరాబాద్‌: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీజీరేరా) ఎస్‌వీబీ ఎస్టేట్స్‌కు గట్టి హెచ్చరిక జారీ చేసింది. అక్టోబర్‌ 31, 2025న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, యోగేష్‌ సదుల చెల్లించిన ₹26 లక్షలను 10.75 శాతం వడ్డీతో 30 రోజుల్లో సంస్థ తిరిగి చెల్లించాలంటూ ఆదేశించింది.

అధికార సంస్థ రియల్‌ ఎస్టేట్‌ (రెగ్యులేషన్‌, డెవలప్‌మెంట్‌) చట్టంలోని సెక్షన్‌ 37 ప్రకారం ఈ ఆదేశం జారీ చేసింది. ‘బర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌’ లేఅవుట్‌లో యోగేష్‌ కొనుగోలు చేసిన ఓపెన్‌ ప్లాట్‌కు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని పేర్కొంది. రీఫండ్‌కి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అత్యధిక మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేట్‌ (ఎంసీఎల్‌ఆర్‌) 8.75%కు 2% చేర్చి, మొత్తం 10.75% వడ్డీని ప్రతి చెల్లింపు తేదీ నుంచి రీఫండ్‌ తేదీ వరకు చెల్లించాలని తెలిపింది. ఆదేశాలను పాటించకపోతే శిక్షలు విధిస్తామని హెచ్చరించింది.

ఫిర్యాదుదారుడి ఆరోపణలు

యోగేష్‌ సదుల 2019 ఆగస్టు 8 నుంచి 2022 డిసెంబర్‌ 7 వరకు రూ.26 లక్షలు చెక్కులు, నగదు, ఆన్‌లైన్‌ బదిలీల రూపంలో ఎస్‌వీబీ ఎస్టేట్స్‌కు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. శంషాబాద్ మండలం పెడ్డటోపర గ్రామంలోని ‘బర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌’ లేఅవుట్‌లో 200 చదరపు గజాల ప్లాట్‌ కోసం రూ.34 లక్షలకు ఒప్పందం కుదిరిందని, 2022 డిసెంబర్‌ 30లోగా రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పి తరువాత పదేపదే వాయిదా వేసారని తెలిపారు. కేటాయించిన ప్లాట్‌ను మూడు సార్లు మార్చి, చివరికి ఫోన్‌లు కూడా ఎత్తలేదన్నారు. తప్పుడు కారణాలు చెబుతూ అదనపు చెల్లింపులు చేయమని ఒత్తిడి తెచ్చారని, జూన్‌ 2022లో ₹2 లక్షలు, సెప్టెంబర్‌లో ₹5 లక్షలు, అక్టోబర్‌లో ఆర్టీజీఎస్‌ ద్వారా ₹2 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు.

డెవలపర్‌ ప్రవర్తనపై ఆరోపణలు

‘ఫార్చ్యూన్‌ ప్యారడైజ్‌’ లేఅవుట్‌లో ముందుగా బుకింగ్‌ చేసుకున్న ప్లాట్‌ను విడిచిపెట్టి ‘బర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌’కు మారమని డెవలపర్‌ ప్రతినిధి వల్లిపి అంకయ్య (అవినాష్‌) ఒప్పించాడని యోగేష్‌ తెలిపారు. ఫార్చ్యూన్ ప్యారడైజ్‌లో ప్లాట్ బుకింగ్ నిమ్మితం ఇచ్చిన ₹8 లక్షలు ఇచ్చారని తెలిపారు. తర్వాత లేఅవుట్‌ అనుమతులు, రిజిస్ట్రేషన్‌ తేదీల గురించి తప్పుదారి పట్టించారని పేర్కొన్నారు. ‘ఫార్చ్యూన్‌ రియాల్టీ’ సంస్థ ఇచ్చిన ₹8 లక్షల రీఫండ్‌ను కూడా వెంకట్‌రావు తమదే అని చెబుతూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తదుపరి విచారణలో ఆధారాలను పరిశీలించిన అథారిటీ, అభివృద్ధి సంస్థలే బాధ్యత వహించాలని తేల్చింది. చెల్లించిన మొత్తాన్ని చట్టబద్ధ వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశిస్తూ,ఉత్తర్వులు జారీ చేసింది.


Tags:    

Similar News