తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని అవలోకిస్తే.. తెలంగాణలో పాలకపక్షం చాలా స్ట్రాంగుగా ఉన్నదనే వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో మనకు వినిపిస్తుంది. కేసీఆర్ సర్కారు హవాకు కోత పెట్టడానికి విపక్షాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ కూడా ఎన్ని పాట్లు పడుతున్నప్పటికీ.. వారికి పెద్దగా ఫలితం దక్కడం లేదు. అయితే తెలుగుదేశం తరఫున కేసీఆర్ సర్కారు మీద విరుచుకు పడే బాధ్యత మొత్తం తనొక్కడితే అన్నంత సీరియస్ గా పోరాడుతూ ఉండే రేవంత్ రెడ్డి తాజాగా ఓ భిన్నమైన వ్యూహంతో వెళుతున్నట్లు కనిపిస్తోంది.
ఏదో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల మీది విమర్శలతో.. పాలకులను చికాకు పెట్టడానికి, ప్రయత్నించడం ఒక ఎత్తు. అయితే ఒక స్కెచ్ ప్రకారం.. పాలక పార్టీకి కొన్ని సామాజిక వర్గాలను దూరం అయ్యేలా చేస్తూ.. వారి బలానికి గండికొట్టడం మరొక ఎత్తు. ఒకటో మార్గంపెద్దగా ఫలితం ఇవ్వడం లేదనే ఉద్దేశంతో , రేవంత్ రెడ్డి ఇప్పుడు రెండో మార్గంలో నడుస్తున్నట్లుంది. ప్రొఫెసర్ జయశంకర్ ను ఆయన కొత్తగా ‘ఓన్’ చేసుకుంటున్నారు. జయశంకర్ కలలుగన్న తెలంగాణ ఇది కాదని, జయశంకర్ స్వప్నాలకు విరుద్ధమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఆయన ఆశయాలకు గండికొడుతున్న పాలన సాగుతున్నదని ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి పదేపదే విమర్శిస్తుండడాన్ని గమనించవచ్చు.
కేసీఆర్ సర్కారు మీద రేవంత్ రెడ్డి తనకు సాధ్యమైనన్ని అన్ని మార్గాల్లోనూ విరుచుకుపడడం ఎప్పుడో పూర్తి చేసేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించకపోవడం, ఫీజు రీఇంబర్స్ మెంట్, రైతు వ్యతిరేకత, ప్రాజెక్టుల్లో అవినీతి, పైపుల కొనుగోలులో కుంభకోణం ... ఇలాంటి అనేక ఆరోపణలన్నీ పాతబడిపోయాయే తప్ప.. సాధించిందేమిటో వారికే అర్థంకాని పరిస్థితి. ఏదో చిన్నా సన్నా నాయకులు ప్రతిస్పందనగా తిరిగి నిందలు వేయడం తప్ప.. తమ విమర్శల పట్ల అసలు నాయకులు పట్టించుకోవడం లేదని కూడా తెలుగుదేశం భావించింది.
అయితే రేవంత్ రెడ్డి వ్యూహం మార్చి.. తెలంగాణ పిత లాంటి హోదాను, ఆదరణను కలిగిఉన్న ప్రొఫెసర్ జయశంకర్ పేరును వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో జయశంకర్ సార్ పేరును రేవంత్ పదే పదే వాడుతున్నారు. నిజానికి రాష్ట్రం కోసం పోరాటం జరిగిన సమయంలో.. జయశంకర్ ఆద్యంతం కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. అప్పట్లో ఎప్పుడూ తెలుగుదేశం ఆయను వాదనను పార్టీ విధానంగా స్వీకరించలేదు. కానీ ఇప్పుడు రేవంత్ తరచుగా జయశంకర్ పేరు తెస్తూ.. ఆయన కలలకు భిన్నమైన పాలన సాగుతోందని బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. జయశంకర్ వ్యతిరేక సర్కార్.. అనే నినాదమైనా పనిచేస్తుందో లేదని రేవంత్ రెడ్డి టెస్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
కానీ.. ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఆరాటం రాజకీయంగా సబబే గానీ.. జయశంకర్ పట్ల అనేక విధాలుగా తమ భక్తిని కేసీఆర్ సర్కారు చాలా స్పష్టంగానే చాటుకుంటున్న నేపథ్యంలో.. రేవంత్ వ్యూహం ఫలితమిచ్చేది అనుమానమే అంటున్నారు పరిశీలకులు.