వైకాపా ఎంతగా కెలికితే అంత భంగపాటు తప్పదు

Update: 2016-10-09 07:01 GMT

తెలుగుదేశం పార్టీ శిక్షణ శిబిరాల్లో మంత్రి చినరాజప్ప మీద నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడని, నిప్పులు చెరిగాడని, దూషించాడనే ఆరోపణలు రెండు రోజులుగా మీడియాలో వెల్లువలా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా తొలుత ప్రచారంలోకి వచ్చిన ఈ అంశాలను తాము భుజానికెత్తుకుని వైకాపా భంగపడింది. లోకేష్ చినరాజప్పతో సంభాషించిన వీడియోను కూడా విడుదలచేసి వైకాపా వారి బురదచల్లుడు కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కలిగేలా చేశారు. నిజానికి అక్కడితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఉంటే వైకాపా కు చాలా బాగా ఉండేది. కానీ.. వారు దాన్ని ఇంకా సాగదీస్తున్నారు.

ఆదివారం నాడు వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఎడిటెడ్ వీడియోలను చూపించి మభ్యపెట్టడం కాదని, పూర్తి వీడియో విడుదల చేయాలని ఆయన అంటున్నారు. పార్టీ నిర్మాణం గురించి లోకేష్ కు అవగాహన లేదనే సంగతి ఆ వీడియో చూస్తే అర్థమైపోతుందని ఆయన ఎద్దేవా చేస్తున్నారు. నిజమే కావొచ్చు. పార్టీ నిర్మాణం గురించి లోకేష్ కు అవగాహన లేకపోవచ్చు. కానీ ప్రస్తుతం టాపిక్ అది కాదు. చినరాజప్పతో ఉన్న ఫోటోలో దూషించినట్లుగా వైకాపా చేసిన ప్రచారం నిజమైనదా కాదా? అనే అంశం గురించి మాత్రమే.

అంబటి రాంబాబు చాలా తెలివిగా.. అసలు పాయింట్ ను అండర్ ప్లే చేస్తూ.. పార్టీ నిర్మాణం ఊసెత్తుతున్నారు. వాడుకుని వదిలేయడం చంద్రబాబుకు అలవాటే అని, జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేశారని, లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడని.. అసలు టాపిక్ కు సంబంధం లేని అనేక అంశాలు ప్రస్తావనకు తెస్తున్నారు. అయితే ఇక్కడ వైకాపా పార్టీ మరియు జగన్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి నిరంతరం జరుగుతూ ఉండే ప్రక్రియలో ఒక పొరబాటు దొర్లిపోయింది. దీన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. ఇదే అంశాన్ని వారు ఎంతగా సాగదీస్తే.. వారు పసలేని ఆరోపణలు మాత్రమే చేస్తున్నారనే సంగతి బహిరంగం అవుతుంది.

Similar News