నోట్ల రద్దు పర్యవసానంగా ఏర్పడుతున్న జనం కష్టాలను దూరం చేయాలని, నోట్ల రద్దు నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరుతూ సోమవారం నాడు దేశవ్యాప్తంగా విపక్షాలు పిలుపు ఇచ్చిన భారత్ బంద్ సక్సెస్ కావడం అనేది అనుమానంగానే కనిపిస్తోంది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రభుత్వం మీద పార్లమెంటులో పోరాడుతున్న ప్రతిపక్షాలు అన్నీ కలిసి పిలుపు ఇచ్చిన బంద్ గా తొలుత ఇది కనిపించినప్పటికీ.. చివరికి కేవలం లెఫ్ట్ పార్టీల కూటమి బంద్ లాగా తేలిపోతోంది. మోదీ మీద పోరాటం సాగించడంలో ... విపక్షాల మధ్య వచ్చిన చీలికల పర్యవసానంగా.. అసలు భారత్ బంద్ సక్సెస్ అయ్యే అవకాశమే కనిపించడం లేదు.
లెఫ్ట్ పార్టీలు పిలుపు ఇచ్చిన బంద్ ను కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బంద్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడానికి తాము వ్యతిరేకం అని ఈ పార్టీలు పేర్కొంటున్నాయి. బంద్ కు సహకరించేది లేదని, దాని బదులుగా ప్రదర్శనలు ర్యాలీలు మాత్రం నిర్వహిస్తామని ఆ పార్టీలు పేర్కొంటున్నాయి. బంద్ జరగకుండా చూడడానికి , బెంగాల్ లో లెఫ్ట్ పార్టీలకు బద్ధ శత్రువు అయిన మమతా బెనర్జీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మోదీ శత్రువే అయినప్పటికీ.. నోట్ల రద్దును సమర్థిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా.. భారత్ బంద్ ను అనుమతించబోయేది లేదంటున్నారు. తెలంగాణలో కూడా బంద్ ను అనుమతించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
మోదీ నిర్ణయాన్ని ఎవరు ఎలా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. బంద్ విషయానికి వచ్చేసరికి విపక్షాలు తలోదారిగా వ్యవహరిస్తుండడం అనేది.. అంతిమంగా ప్రభుత్వానికి మేలు చేస్తోంది.