తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పోకడలకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఏయే అంశాలు దొరుకుతాయా అని వెతుక్కుంటున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోకూడదనుకుంటున్నాయి. అలాంటి నేపథ్యంలో జిల్లాల ఏర్పాటు మీద చేసిన విమర్శలు తేలిపోయిన తర్వాత.. 31 జిల్లాల కొత్త రాష్ట్రం రూపుదిద్దుకున్న తరవాత.. తెలుగుదేశం ఆధ్వర్యంలో వరంగల్ లో పెద్ద ధర్నా జరిగింది. రైతు సమస్యలను దీనికి ప్రాతిపదికగా తీసుకున్నారు. నకిలీ విత్తనాలు అనేది ప్రధాన ఎజెండా, రైతు ఆత్మహత్యలు కూడా ప్రస్తావించారు.
అయితే ఈ ధర్నాలో తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించిన తీరు, ఉద్యమించిన తీరు ఒకింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న నకిలీ విత్తన కంపెనీ యజమాని , ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమీప బంధువు అని, అందుకే ఆయన మీద చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విత్తన కంపెనీల మీద చర్యలకు ఉపక్రమిస్తున్న అధికార్లను ప్రభుత్వం బదిలీ చేస్తున్నదని కూడా ఆరోపణలు చేసేశారు.
అయితే.. అసలు సదరు నకిలీ విత్తన కంపెనీ ఏది? అన్న సంగతి మాత్రం రేవంత్ చెప్పలేదు? ఆ కంపెనీ యజమాని, కేసీఆర్ కు బంధువు అయిన వ్యక్తి ఎవరో చెప్పలేదు. కనీసం కంపెనీ పేరు కూడా చెప్పలేదు. జనం కోరుకుంటున్నది ఏంటంటే.. కనీసం కంపెనీ పేరు చెబితే.. ప్రజలు ఆ కంపెనీకి దూరంగా ఉంటారు కదా.. వారి విత్తనాలను వాడకుండా ఉంటారు కదా.. ప్రభుత్వ చర్యల సంగతి తర్వాత.. ముందు ప్రజలు ఆ కంపెనీ విత్తనాలకు దూరంగా ఉంటారు కదా అనే వాదన వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఇలా సగం సగం పోరాటాలు చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదని పలువురు అనుకుంటున్నారు. ఇలాంటి పోరాటాలు ప్రభుత్వం మీద నిందలు వేయడానికి ఈ నాయకులకు ఉపయోగపడేవే తప్ప.. వాస్తవంగా ప్రజలకు దీనివల్ల కలిగే మేలు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.