ఫరెగ్జాంపుల్ మనం స్టేట్ బ్యాంకు వెళ్లి హైదరాబాదు బ్రాంచిలో ఉన్న మన ఖాతాలోని పది వేల రూపాయల సొమ్మును , రాజమండ్రి బ్రాంచిలో ఉన్న మిత్రుడి స్టేట్ బ్యాంకు ఖాతాకు బదలాయించాల్సిందిగా కోరాం అనుకోండి... ఆ డబ్బును బదిలీ చేసేస్తూ.. అందుకుగాను మన ఖాతాలోంచి కొంత చార్జీలను బ్యాంకు వసూలు చేసుకుంటుంది. ఇతర బ్యాంకు శాఖల ఖాతాల్లోకి బదలాయించాలంటే మరింత భారీగా రుసుములు ఉంటాయి. ఇది రివాజు. ఒక బ్యాంకు, అక్కడ మన పనిచేయడానికి ఒక వ్యక్తి అంతా కలిపి ఒక వ్యవస్థ మొత్తం పనిచేస్తున్నది గనుక.. రుసుముల వసూలు సబబే అని అనుకుంటాం మనం. అయితే.. అదే మనం మనంతట ఆన్‌లైన్ లోకి వెళ్లి.. మనం ఇంటర్‌నెట్ చార్జీలు చెల్లించుకుంటూ.. మన కరెంటు వాడుకుంటూ.. మన ల్యాప్‌టాప్‌లో అదే బ్యాంకు ఖాతా నుంచి మిత్రుడి ఖాతాలోకి డబ్బు బదలాయించాం అనుకోండి.. అందులో వెబ్‌సైట్ ను నిర్వహించడం మినహా బ్యాంకు యాజమాన్యానికి అవుతున్న ఖర్చు అంటూ ఏమీ లేదు. కానీ.. ఆ లావాదేవీకి కూడా వారు మన వద్ద రుసుములు వసూలు చేస్తారు. అందులో వారికి అయ్యే ఖర్చు సున్నా అయినా సరే!’’
‘‘మనం దుకాణంలో సరుకులు కొని కార్డు స్వైప్ చేశామంటే గనుక.. ఆటోమేటిగ్గా మన డబ్బు దుకాణదారు ఖాతాలోకి వెళ్తుంది. ఇందుకు ఓ బ్యాంకు సర్వీసుల ఆధారంగా లావాదేవీ ఆటోమేటిగ్గా జరుగుతుంది. దానికి గాను బ్యాంకు వారు లబ్ధి పొందిన దుకాణదారునుంచి కొంత రుసుము పర్సంటేజీ రూపంలో వసూలు చేస్తారు. అందుకే చాలా దుకాణాల్లో మనం కార్డు ద్వారా చెల్లిస్తాం అని చెబితే.. ‘అయితే 2 శాతం ఎక్స్ ట్రా’ అని మన ముక్కు పిండి వసూలు చేస్తారు. అంతిమంగా వినియోగదారుడి జేబుకే చిల్లు. అక్కడ కూడా సున్నా ఖర్చుతో జరిగే ఆటోమేటెడ్ లావాదేవీ మీద బ్యాంకుకు చార్జీలు వసూలవుతాయి.’’
మరి అలాంటి సున్నాఖర్చుతో వచ్చే ఆన్‌లైన్ లావాదేవీలపై వచ్చే రుసుముల రాబడిని వదులుకోవడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయా? దేశం మొత్తాన్ని డిజిటల్ లావాదేవీలవైపు మళ్లించడం పెద్ద కష్టం కాదు.. కానీ ప్రతి లావాదేవీకి రుసుముల పేరిట వారి నడ్డి విరిచేలా చార్జీలు వడ్డించకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. క్యాష్ రూపంలో చెల్లించడానికి, కార్డు రూపంలో చెల్లించడానికి మధ్యలో కొత్తగా తనమీద పడే భారం ఏమీ లేదని తెలిసినప్పుడు.. కస్టమరు సాధారణంగా కార్డు లావాదేవీనే ఇష్టపడతారు. అయితే ఇలా ‘‘సున్నా ఖర్చుతో వచ్చే ఛార్జీల రాబడి’’ మొత్తం వదులుకోవడానికి బ్యాంకులు సిద్ధంగానే ఉన్నాయా?
.. సరిగ్గా ఈ పాయింటు మీదనే చంద్రబాబు ఆధ్వర్యంలో , దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడానికి ఏం చేయాలో సూచించేందుకు ఏర్పాటైన కమిటీ సక్సెస్ ఆధారపడి ఉంది. కేవలం పైన పేర్కొన్నవి మాత్రమే కాదు. డిజిటల్ లావాదేవీల మీద గుట్టుచప్పుడు కాకుండా.. బ్యాంకులు అనేక రకాల రుసుములు వసూలు చేస్తుంటాయి. మనకే తెలియకుండా మన అకౌంట్ లో సొమ్ముకు కాళ్లు వచ్చేలాగా.. బ్యాంకులు వడ్డించే చార్జీలు చాలానే నడుస్తుంటాయి. ఇలాంటి రుసుములు అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడితే తప్ప ఈ దేశంలో మార్పు వచ్చే అవకాశం లేదు.
కమిటీ కన్వీనర్ హోదాలో చంద్రబాబునాయుడు గురువారం తొలిసారిగా నిర్వహించిన సమావేశంలో అందరూ దాదాపుగా రుసుముల రద్దు గురించిన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
అలాగే స్వైపింగ్ మెషిన్లు, ఈ పాస్ మెషిన్ల వాడకాన్ని పెంచాలంటే.. ఆ మెషిన్లు వ్యాపారలు అందరూ వాడే పరిస్థితి ఉండాలి. వ్యాపారుల్ని ప్రేరేపించాలి. అవి బాగా తక్కువ ధరకు దొరికేలా అందుబాటులోకి తీసుకురావాలి. అంటే ఆ తరహా డిజిటల్ లావాదేవీలకు ఉపయోగపడే అన్ని రకాల యంత్రాల మీద, వాటి అమ్మకాల మీద ప్రభుత్వం వసూలు చేసే దిగుమతి, ఎక్సయిజు సుంకాలు అన్నీ రద్దు చేయాలి. అప్పుడు ఖచ్చితంగా సానుకూల ఫలితాలు ఉంటాయి.
ఫరెగ్జాంపుల్.. ఇవాళ్టి రోజున.. ఒక రైతుబజార్ లో ఒకే దుకాణదారు వద్ద స్వైపింగ్ మెషిన్ ఉన్నదని అనుకుందాం. వినియోగదారులందరూ కార్డు గీయడానికి అతని వద్దకే వచ్చి కూరగాయలు కొంటారు తప్ప.. అసలే చిల్లర దొరకని రోజుల్లో ఇతర షాపులకు వెళ్లి నగదు ఖర్చు చేయాలని అనుకోరు. ఇలాంటి ఎడ్వాంటేజీలను ప్రభుత్వాలు దుకాణదారులకు తెలియజెప్పాలి.
అయితే జనంలో కొత్త రకం లావాదేవీలపై మొగ్గు రావాలంటే.. ఈ రుసుముల రద్దు అనే తాయిలం వారికి రుచి చూపించాలి. అది వారికి ప్రేరణ ఇస్తుంది. దేశాన్ని ఒక కొత్త దశవైపు నడిపించదలచుకుంటున్న ప్రభుత్వ ఆశయమూ నెరవేరుతుంది.
అయితే రుసుముల ద్వారా లాభాన్ని వదలుకోవడానికి బ్యాంకులను ఒప్పించడం అనేది సర్కారు బాధ్యత. ఇప్పుడు బలవంతంగా దేశంలోని ప్రజలందరినీ కష్టనష్టాలకు గురిచేస్తున్నట్లే.. బలవంతంగానైనా బ్యాంకులను ఒప్పించాలి. వారికి నష్టం తగ్గించేందుకు.. వినియోగదారుడు భౌతికంగా బ్యాంకు శాఖకు వచ్చి నిర్వహించే ప్రతి లావాదేవీపై కొంత రుసుము విధించవచ్చు. దీనివల్ల బ్యాంకులకు అదనపు లాభం వస్తుంది. బ్యాంకు శాఖల మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది.
ఇప్పుడున్న వ్యవస్థలకు ఇబ్బంది అయినప్పటికీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకుండా.. జాతి మొత్తాన్ని డిజిటల్ లావాదేవీల ప్రపంచంవైపు మళ్లించడం అసాధ్యం. చంద్రబాబునాయుడు సారథ్యంలోని ప్రభుత్వం ఆ పని చేయగలిగితే.. ఓ అద్భుతాన్ని సృష్టించినట్లు. చేయలేకపోతే.. దేశంలో ప్రజల కన్నీళ్లను తుడిచినట్లుగా నటించడానికి ప్రభుత్వాలు ఏర్పాటుచేసే అనేకానేక కమిటీల్లో ఇది కూడా ఒకటిగా మిగిలిపోతుంది.