రాజమౌళి బెటరా? వాళ్లు బెటరా?

Update: 2016-12-08 18:00 GMT

రాజమౌళి టాలీవుడ్ దర్శక దిగ్గజం అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆయన ప్రతిభా పాటవాలు సినిమా దర్శకత్వానికి సంబంధించినవా.. భవనాల డిజైనింగ్ కు సంబంధించినవా? ఏపీ సర్కారు ఆయన గురించి ఏం అనుకుంటోంది.. అనేదిప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. బాహుబలి చిత్రంలో రాజు కోట గట్రా చాలా బాగున్నాయంటే.. అమరావతిలో అలాంటి కోటలు కట్టించుకోవాలని ఆయనను ఆశ్రయిస్తే ఏం సబబుగా ఉంటుంది. నిజానికి కోటలు అద్భుతంగా ఉన్నా సరే.. అందులోని పనితనం ఆర్ట్ డైరక్టర్ కు చెందుతుంది. కోటలు, భవనాలు బాగుంటే.. అవార్డులు ఆర్ట్ డైరక్టర్ కు ఇస్తారు గానీ.. దర్శకుడికి ఇవ్వరు కదా.. ! అందమైన భవంతులను రూపుదిద్దడంలో ఎక్కువ పాత్ర ఆర్ట్ డైరక్టర్ దే ఉంటుంది. అయితే సరైన సినిమాకు సరైన ఆర్ట్ డైరక్టర్ ను ఎంపిక చేసుకోవడం, వారిలోని ప్రతిభను పిండుకోవడం అనేది దర్శకుడి ప్రతిభ. అంతే తప్ప.. భవంతి బాగుండగానే.. దాని ఘనత దర్శకుడిది అనుకోవడం పొరబాటు.

ఏపీ సర్కారు ఇప్పుడు అదే పొరబాటు చేస్తోంది. అమరావతి నగరానిన అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్న చంద్రబాబు సర్కారు... జపాన్ వారితో డిజైన్లు చేయించి.. థర్మల్ పొగగొట్టాల్లాంటి భవంతుల నమూనాలతో అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆకృతుల్లో భారతీయత కనిపించాలనే అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతానికి లండన్ సంస్థను మాస్టర్ ఆర్కిటెక్ట్ గా ఎంపిక చేశారు గానీ.. వారికి భారతీయ నిర్మాణ శైలులు, నమూనాల గురించి అవగాహన కల్పించడానికి ఇంకా పాట్లు పడుతున్నారు.

ఆ క్రమంలో భాగంగానే దర్శకుడు రాజమౌళిని కూడా కలిసి అమరావతి భవనాల డిజైన్ల విషయంలో సహకారం కోరారుట. అయితే.. బాహుబలి 2 పనుల్లో బిజీగా ఉన్నానని అవి అయ్యేదాకా చేయలేనని రాజమౌళి సున్నితంగా తిరస్కరించారుట. పైగా సినిమా సెటింగులు వేరు, నిజమైన భవంతులు వేరు అని కూడా రాజమౌళి వారితో చెప్పారుట. బాహుబలి 2 అయ్యేదాకా రాజమౌళి కోసం ఆగి, తర్వాత డిజైన్లు చేయించాలంటే.. ఇక 2018 లోగా భవంతులు కొన్ని పూర్తి కావాలనే చంద్రబాబు లక్ష్యం అటకెక్కడం గ్యారంటీ.

అయినా చోద్యం కాకపోతే.. రాజమౌళి సినిమాల్లో సెటింగులు బాగున్నట్లయితే.. వాటికి ఆర్ట్ డైరక్టర్లుగా పనిచేసిన ఆనంద్ సాయినో, సాబు శిరిల్ నో ఏపీ సర్కారు సంప్రదించాలి. వారి ద్వారా లండన్ సంస్థకు ఐడియాలు, భారతీయ ఉట్టిపడే అంశాల గురించి అవగాహన కల్పించాలి. అంతే తప్ప.. అసలు కీలకమైన ఆర్ట్ డైరక్టర్లను వదిలేసి.. దర్శకుడిని ఆశ్రయించడం ఉపయోగం లేదని పలువురు అంటున్నారు.

Similar News