మోదీకి మద్దతుకు కేసీఆర్ మూల్యం చెల్లించాలా?

Update: 2016-12-08 17:20 GMT

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒకటే కీలక చర్చ నడుస్తున్నది. నోట్ల రద్దు అనే కీలక వ్యవహారం చోటు చేసుకుని 30 రోజులు గడుస్తున్నప్పటికీ.. ప్రజల కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప.. తగ్గుముఖం పట్టకుండా పోతున్న నేపథ్యంలో.. మోదీ మీద సామాన్యుల్లో, మధ్య తరగతిలో తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని కేసీఆర్ సర్కారు కూడా పంచుకోవాల్సి ఉంటుందా? మోదీ నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతిచ్చి, మోదీ డిజిటల్ లావాదేవీల స్వప్నానికి జై కొట్టినందుకు కేసీఆర్ సర్కారు మూల్యం చెల్లించాల్సి వస్తుందా? అనేదే కీలకంగా పలువురు మాట్లాడుకుంటున్నారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత కూడా.. స్థానిక రాష్ట్ర వ్యవహారాలు కొంత మరుగున పెట్టేసి.. నోట్ల రద్దు విషయంలు మోదీ సర్కారు పక్షాన నిలిచినందుకు, ప్రజల కష్టాలను గాలికి వదిలేశారంటూ.. హాట్ టాపిక్ గా దానినే చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో తెరాసను కూడా భాజపాతో సమానంగా నిందిస్తున్న టీ కాంగ్రెస్.. శాసనసభ సమావేశాల్లోనూ.. మరింత రెచ్చిపోయి.. నోటు కష్టాలకు కేసీఆర్ సర్కారుది కూడా అంతే బాధ్యత అంటూ ప్రచారం చేయబోతున్నది.

చూడబోతే తెరాస దళాలు తాము మోదీ వెన్నంటి ఉండి తప్పు చేశామా అనే అంతర్మధనంలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. గులాబీ బాస్ నిర్ణయాన్ని వ్యతిరేకించగల స్థితిలో ఎవరూ లేకపోయినప్పటికీ.. లోలోన మధనపడుతున్నట్లు తెలుస్తోంది.

నిజానికి మోదీ నవంబరు 8న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు.. కేసీఆర్ దానిపట్ల అసహనమే వ్యక్తం చేశారు. నవంబరు 19న మోదీతో ఫోనులోనూ మాట్లాడారు. ఆ తర్వాతి పరిణామాల్లో వైఖరి పూర్తిగా మారిపోయింది. దిల్లీ వెళ్లి మోదీతో భేటీ కావడం , తిరిగి రాగానే.. అచ్చంగా మోదీ నిర్ణయానికి మద్దతు ఇవ్వడం, ఆయన డిజిటల్ కలలు నెరవేర్చే బాధ్యతను తెలంగాణ సర్కారు భుజానికెత్తుకోవడం జరిగింది. దిల్లీ భేటీలో మోదీ తో కేసీఆర్ ఏవో కొన్ని హామీలు పొందారని, అందుకే వైఖరి పూర్తి భిన్నగా మారిందని అంతా అనుకున్నారు.

సాధారణంగా మిగులు రాష్ట్రంగా ఉండవలసిన తెలంగాణ... నోట్ల దెబ్బ వలన తరుగు రాష్ట్రంగా తయారయింది. చాలా రంగాల మీద నుంచి వచ్చే కీలకమైన ఆదాయం పడిపోయింది. ఈ పరిణామాలు అన్నిటినీ సహిస్తూ.. కేసీఆర్ సర్కారు మద్దతివ్వడంలో వ్యూహం ఉన్నదని అంతా అనుకున్నారు. అయితే.. తాజాగా నెల గడుస్తున్నా కష్టాలు తొలగకపోవడం.. ఇప్పట్లో సామాన్యులకు కన్నీళ్లు తప్పే పరిస్థితి లేకపోవడంతో.. మోదీతో పాటుగా కేసీఆర్ కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుందా అని పలువురు అంచనా వేస్తున్నారు.

Similar News