మార్పునేస్తం : అక్రమాలకు చెక్ పెట్టాలంటే అప్రమత్తత తప్పదు!

Update: 2016-12-07 07:00 GMT

రాష్ట్రాన్ని డిజిటల్ యుగంవైపు నడిపించడంలో చంద్రబాబునాయుడు వేగంగా అడుగులు వేయాలని అనుకుంటున్నారు. ఏపీ పర్స్ యాప్ ను కూడా ఆవిష్కరించేశారు. అయితే యాప్ వచ్చినంత మాత్రాన సామాన్యులు లావాదేవీలు చేయడం కష్టం గనుక, వారికి అవగాహన కలిగించడానికి, అలవాటు చేయడానికి ‘మార్పు నేస్తం’ అనే యువతకు ఉపాధి మార్గాన్ని కూడా చంద్రబాబు రూపొందించారు. ప్రజలకు డిజిటల్ లావాదేవీల గురించి నేర్పడమూ, వారు లావాదేవీలు చేసేలా చూడడమూ కూడా ఈ ‘మార్పునేస్తం‘ బాధ్యత. అలా చేసినందుకు వారికి కొంత రుసుము ముడుతుంది. ఉపాధికి బాగానే ఉంటుంది. కానీ.. అసలే ఆర్థిక, బ్యాంకు వ్యవహారాలతో ముడిపడిన ఈ లావాదేవీల విషయంలో ‘మార్పునేస్తం’ ఉండే వాళ్లు అక్రమాలకు తెరతీస్తే.. గ్రామీణుల బ్యాంక్ అకౌంట్ల ఆనుపానులు తెలుసుకుని.. అవాంఛనీయ నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే ‘మార్పునేస్తం’ ఎంపిక మరియు వ్యవహార నిర్వహణలో చాలా అప్రమత్తత అవసరం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబునాయుడు ప్రకటించిన పథకం ప్రకారం.. మార్పు నేస్తం పేరుతో ఓ ప్రతినిధి ఉంటారు. ఔత్సాహికులు ఏపీ పర్స్ యాప్ ద్వారా తమ పేర్లను ఇందుకోసం నమోదు చేసుకోవచ్చు. నమోదు అయిన వారు డిజిటల్ లావాదేవీలపై ప్రజలకు శిక్షణ ఇచ్చి నమోదు చేయించాలి. అలా ఒక్కొక్కరిని చేర్చినందుకు ‘నేస్తం’కు రూ.15 లభిస్తుంది. అలాగే ఆ తరువాత కూడా.. సదరు సభ్యులు వారానికి కనీసం రెండు డిజిటల్ లావాదేవీలు చేసేలా.. నేస్తం జాగ్రత్త తీసుకోవాలి. అలా జరిగితే ఒక్కో లావాదేవీకి 5 రూపాయల వంతున ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది. అంటే తాము చేర్చిన సభ్యులందరి మీద వారికి నెలకు మూడు వేలకు పైగా ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఇదీ చంద్రబాబు ప్రకటించిన సంగతి. బ్యాంకర్లు ఇచ్చే ప్రోత్సాహకాలు అదనంగా వస్తాయిట.

అయితే ‘మార్పు నేస్తం’ కింద నమోదు అయ్యే యువత.. తాము చేర్పించిన సభ్యులతో వారం వారం లావాదేవీలు చేయించడానికి చేసే ప్రయత్నంలో తామే చేసే అవకాశమూ ఉంటుంది. అంటే.. పేదలు, గ్రామీణులు, నిరక్షరాస్యుల విషయంలో వారి బ్యాంకు ఖాతాల పాస్‌వర్డ్ లు , ఇతర సమాచారం ఈ మార్పునేస్తం ప్రతినిధులకు తెలిసిపోయే ప్రమాదం ఎక్కువ. వాటిని వాడుకుని వారు అక్రమాలకు పాల్పడితే.. నానా గందరగోళం తయారవుతుంది. ఇలాంటి పోకడలు పెరగకుండా.. ప్రభుత్వం అప్రమత్తత పాటించాల్సి ఉంటుందని పలువురు అంటున్నారు. మార్పు నేస్తం ప్రతినిధులు ఎలాంటి అవకతవకలకు పాల్పడినా చాలా పెద్ద గందరగోళం జరుగుతుందని, ప్రధానంగా డిజిటల్ లావాదేవీలు అనే ప్రక్రియమీదనే ప్రజల్లో భయాలు పెరిగి, లక్ష్యం దెబ్బతింటుందని కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Similar News