‘మా నాన్నను స్మరించుకునేలా.. మీరు పాలించాల్సిందే’

Update: 2016-12-10 07:30 GMT

వైఎస్ జగన్మోహన రెడ్డికి ఎన్నికల మూడ్ వచ్చేసినట్లుంది. ఏడాదిలో ఎన్నికలు వస్తాయని పార్టీ వర్గాలు ఇప్పటినుంచే సిద్ధం కావాలని మార్గదర్శనం చేస్తున్న జగన్మోహన రెడ్డి.. తన ప్రజాందోళనల్లో చేస్తున్న ప్రసంగాలు కొంచెం చిత్రంగా కనిపిస్తున్నాయి. తెలుగు ప్రజలందరూ మానాన్నను స్మరించుకోవాలి.. మహానేతను గుర్తుతెచ్చుకోవాలి.. ఆయనకు రుణపడి ఉండాలి.. ఆ విధంగా నువ్వు పాలన సాగించాలి.. అని ఆయన చంద్రబాబును డిమాండ్ చేస్తున్నట్లుగా ఉంది. ఆరోగ్యశ్రీ అమలు విషయంలో వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శుక్రవారం ధర్నాలు నిర్వహించింది. ఒంగోలులో జగన్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరూ మా నాన్నను గుర్తు తెచ్చుకునేలా.. చంద్రబాబు పథకాలు అమలు చేయాలన్నట్లుగా ఆయన ప్రసంగంలో భాష్యాలు చెప్పడం విస్తుగొలుపుతోంది.

ఆరోగ్యశ్రీ పథకంలో నిధులు విడుదల కాక పేదలకు చికిత్సను నిరాకరించిన పరిస్థితి ఎక్కడైనా ఉంటే దాన్ని సూటిగా ప్రస్తావించాలి. ఫీజు రీఇంబర్స్ మెంట్ సకాలంలో రాక విద్యార్థుల్ని గెంటేసిన పరిస్థితి ఎక్కడైనా ఉంటే దాన్ని సూటిగా ప్రస్తావించాలి. నిజానికి అలాంటివేమీ లేవు. జగన్ ప్రసంగం ఎలా సాగినదంటే..

ఆ రెండు పథకాలు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టినవి గనుక.. చికిత్స చేయించుకున్న ప్రతిసారీ పేదోడికి వైఎస్సార్ గుర్తుకొస్తాడు గనుక, ప్రతి విద్యార్థికీ వైఎస్సార్ గుర్తుకొస్తాడు గనుక.. చంద్రబాబు నాయుడు ఆ రెండు పథకాలకు తూట్లు పొడుస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు. అంటే చంద్రబాబు ఆ రెండు పథకాలకు ఎడాపెడా నిధులు ఇచ్చేసి సక్రమంగా అమలు చేస్తే.. ప్రజలంతా వైఎస్సార్ ను స్మరించుకుంటూ ఉంటారనేది జగన్ కోరిక లాగా ఉంది. జనం కష్టాల గురించి తాను పోరాడుతున్నట్లుగా కాకుండా.. వైఎస్సార్ ను స్మరించుకోవడం కోసం తాను పోరాడుతున్నట్లుగా జగన్ కనిపిస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ సంగతేంటి...

సంక్షేమపథకాలకు జగన్ చెబుతున్న నిర్వచనం మరియు భాష్యం ప్రకారం.. సంక్షేమ పథకాలను ఎవరు ప్రారంభిస్తే.. వాటి ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలు ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా వారినే స్మరించుకుంటూ ఉంటారన్నమాట. ఆ సిద్ధాంతమే నిజమైతే గనుక.. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు పూటలా నాలుగు మెతుకులు తింటున్న ప్రతి పేదవాడూ.. అన్న ఎన్టీఆర్ ను మరచిపోవడానికి వీల్లేదు. ప్రతిరోజూ అన్నం తినేప్పుడు ముద్ద ముద్దకూ ఎన్టీఆర్ పేరు చెప్పుకుని తినాల్సిందే. ఇవాళ రూపాయికి వస్తున్నాసరే, ఆరోజున రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ సంగతేమిటి?

ఈ పథకాల్లో లబ్ధిదారులంతా వైఎస్సార్ నే స్మరించుకుంటారని పదేపదే అనడం ద్వారా.. చంద్రబాబునాయుడులో వాటి పట్ల మరింత విముఖత పెంచడానికి జగన్ తనకు తెలియకుండానే కారణం అవుతున్నట్లుగా కనిపిస్తోంది. కాబట్టి.. ఏ పథకం వల్ల జనం ఎవరిని స్మరించుకుంటారనేది ఎజెండా కాకుండా.. ప్రజల బాధలు, కష్టాలు మాత్రమే ప్రేరణగా జగన్ తన పోరాటాలను , ప్రధానంగా ప్రసంగాలను ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది.

Similar News