ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ షాక్ ల మీద షాక్ లు తట్టుకోలేక రాజీపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీకి చేరువయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో ఈమేరకు రహస్య చర్చలు లాలూ యాదవ్ బీజేపీ నేతలతో ప్రారంభించినట్లు తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణం కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆయన కుటుంబసభ్యులపై వరుసగా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. లాలూ ఇద్దరు కొడుకులూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన కొడుకుల భవిష్యత్ కోసం లాలూ ప్రసాద్ బీజేపీతో లాలూచీ పడాలని భావిస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తాను జైలు కెళ్లినా తన కొడుకుల రాజకీయ భవిష్యత్ బాగుండాలనే లాలూ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలతో రహస్య చర్చలు జరుపుతున్న వారిలో ఆర్జేడీ పార్లమెంటు సభ్యుడు ప్రేమ్ చంద్ గుప్తా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంపీ ప్రేమచంద్ గుప్తా ఇప్పిటికే లాలూ పార్టీని దగ్గరకు చేర్చుకోవాలని బీజేపీ నేతలను కలిసి వివరించినట్లు చెబుతున్నారు.
నితీష్ వైపే బీజేపీ మొగ్గు.......
ప్రస్తుతం బీహార్ లో మహాగడ్భంధన్ సర్కార్ ఉంది. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ లు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంత కాలం నుంచి నితీష్, లాలూ యాదవ్ ల మధ్య కూడా పెద్దగా సఖ్యత లేదన్న విషయం అనేకసార్లు బయటపడింది. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న లాలూ పార్టీని నితీష్ కూడా వదిలించుకోవాలనుకుంటున్నారు. అందుకే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ, నోట్ల రద్దు సమయంలోనూ బీజేపీనే సమర్ధించారు నితీష్. ఈ నేపథ్యంలో లాలూ కన్నా నితీష్ బెటర్ అని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అవినీతి ఆరోపణలున్న లాలూను దరిచేర్చుకుంటే పార్టీకి చెడ్డపేరు రావడమే కాకుండా ఆ ప్రభావం దేశవ్యాప్తంగా పడుతుంది. అదే క్లీన్ ఇమేజ్ ఉన్న నితీష్ తో జతకడితేనే బెటర్ అని బీజేపీ భావిస్తుంది. అందుకే లాలూ ప్రపోజల్ కు బీజేపీ నో చెప్పినట్లు సమాచారం. దీంతో లాలూ తన కొడుకుల రాజకీయ భవిష్యత్తు కోసం చేసిన చివరి ప్రయత్నమూ ఫలించే పరిస్థితి కన్పించడం లేదు. నితీష్ ప్రభుత్వానికి లాలూ షాకిచ్చినా బీజేపీ అండగా నిలబడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో లాలూ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.