చంద్రబాబు నాయుడుకు ఒక ఆలోచన వచ్చిందంటే.. దాన్ని ఆచరణలో పెట్టేసేవరకు మంచి చెడులను గురించిన లోతైన అంచనాలు కూడా చేయరు. తనకు వచ్చిన కొత్త ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టేసి.. ఆ మేరకు తానే ప్రప్రథముడిగా క్రెడిట్ తీసుకోవాలనే కోరిక మాత్రమే ఆయనకు ఉంటుంది. ఇప్పుడు నోటు కష్టాల విషయంలో ప్రజలు నానా పాట్లు పడుతూ ఉన్న సమయంలో.. వీటన్నింటికీ మొబైల్ లావాదేవీలు ఒక్కటే పరిష్కారం అన్నట్లుగా ఆయన ఫిక్సయిపోయారు. పేదలకు ప్రభుత్వమే ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తుందని కూడా చంద్రబాబు చెప్పేశారు. అదే సమయంలో ఆన్ లైన్ మొబైల్ లావాదేవీల మీద రుసుములు రద్దు చేయాలని కూడా కేంద్రాన్ని కోరారు. కానీ తాజాగా ఆయన దూకుడు మొత్తం ప్రభుత్వం తరఫున పది లక్షల స్మార్ట్ ఫోన్లు కొని ప్రజలకు పంచేయాలన్న దాని మీదనే ఉంది.. అంతే తప్ప రుసుములు రద్దు అనేది సాధిస్తే.. ప్రజలకే మోజు పుట్టి ఫోన్లు కొనుక్కుంటారనే సంగతిని ఆయన గుర్తించడం లేదు.
పేదలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లుగా చంద్రబాబునాయుడు రెండు రోజుల కిందట ప్రకటించారు. కానీ.. ఆయనకు ఈ రెండు రోజుల వ్యవధిలో అది అత్యద్భుతమైన ఆలోచనగా స్పురించినట్లుంది. ఉచితంగా పేదలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చేయడం పై అప్పుడే కసరత్తు ప్రారంభించారు.
స్మార్ట్ పల్స్ సర్వే ద్వారా స్మార్ట్ ఫోన్లు లేని పేదలను గుర్తించి వారికి ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన. రాష్ట్రంలో పదిలక్షల మంది ఇలాంటి నిరుపేదలు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. వీరికి పదిలక్షల మొబైల్స్ కొనడానికి అప్పుడే మూడు కంపెనీలతో కూడా చర్చలు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి.
చంద్రబాబు చేతనైతే ముందుగా మొబైల్ ఆర్థిక లావాదేవీలపై రుసుములను రద్దు చేయించే ప్రయత్నం చేయాలి. దానివల్ల అందులో ఉండే ఉపయోగం ప్రజలకే తెలిసివస్తుంది. కాస్త మొబైల్ పరిజ్ఞానం ఉన్న వారందరూ ఆ తరహాలో లావాదేవీలు చేయడానికి మొగ్గు చూపిస్తారు. తాను చేయాల్సిన పని చేయకుండా.. పేదలకు మొబైల్ ఫోన్లు పంచడం వంటి.. ఖజానా మీద భారం మోపే నిర్ణయాల మీద మాత్రం ఆవేశంగా స్పందిస్తూ ఉండడంపై చంద్రబాబునాయుడు తన పోకడల్ని తనే సమీక్షించుకుంటే రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుంది.