అంతరిక్షం మీద మన దేశం ఎంతగా అధికారం సంపాదించిందంటే.. కొంచెం అతిశయంగా చెప్పాలంటే వారానికి ఒక రాకెట్ వంతున మన వాళ్లు శ్రీహరికోట నుంచి పంపేస్తూ ఉన్నారు. నగరాల మధ్య నడించే వీకెండ్ ఎక్స్ ప్రెస్ రైళ్ల లాగా.. శ్రీహరి కోట లాంచ్ ప్యాడ్ వారానికి ఒకటి పంపుతూ ఉంటుంది. ఇంత ఆధునిక, శాస్త్ర సాంకేతిక యుగంలో కూడా పిల్లలు పుట్టడం కోసం యాగం చేయడం వంటి ఆధ్యాత్మిక విశ్వాసాలు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తాయి. అందులోనూ ప్రత్యేకంగా కొడుకే పుట్టాలనే కోరికతో యాగాలు చేయడం.. కూతురు అంటే ఇంకా వివక్ష నిండిన సమాజం కనిపించడం మరింతగా బాధ కలిగిస్తుంది.
విజయవాడలో రెండు రోజులుగా పుత్రకామేష్టి యాగం జరిగింది. ఏర్పేడులోని వ్యాసాశ్రమం వారు.. భారీ ఎత్తున ప్రచారం నిర్వహించి మరీ.. ఇక్కడ పుత్రకామేష్ఠి యాగాన్ని నిర్వహించారు. పున్నామ నరకం నుంచి మిమ్మల్ని కాపాడే పుత్రుడు పుడతాడంటూ.. యాగం నిర్వహించడం విశేషం. పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతున్న మరియు, పిల్లలకోసం ఆస్పత్రులను సంప్రదించే పనిలో ఉన్న కొన్ని వందల మంది యువ దంపతులు ఎగబడి ఈ యాగంలోరుసుములు చెల్లించి పాల్గొన్నారు. యాగం వల్ల దశరథ మహారాజుకు రాముడు తదితరులు పుట్టినట్లే మను కూడా సులక్షణ శోభితులైన కొడుకులు పుడతారని వారు ఆశపడడంలో తప్పులేదు.
కానీ ఈ యుగంలో కూడా ఇలాంటి నమ్మకాలతో ఆశల్లో ఉండే యువదంపతుల్ని నమ్మించడం ఎంత వరకు కరెక్టు అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే మాకు శుభం జరగాలి అని కోరుకుంటూ పూజలు, యాగాలు చేయడం ఒక ఎత్తు. పిల్లల కోసం పూజలను కూడా అర్థం చేసుకోవచ్చు.. కానీ కొడుకే కావాలంటూ చేసే పూజలను వివక్షకు నిదర్శనాలుగా కాక మరెలా చూడాలి?
వ్యాసాశ్రమం అంటే సాధారణంగా ఆధ్యాత్మిక చింతన పరాయణుల్లో ఒక గౌరవం ఉండేది. మళయాళ స్వామి ప్రారంభించిన వ్యాసాశ్రమం గీతాప్రచారానికి పేరుమోసింది. అంతే తప్ప.. ఆధ్యాత్మిక గిమ్మిక్కులకు ఎప్పుడూ పాల్పడలేదు. మరి అలాంటి వ్యాసాశ్రమం కీర్తి పాడవకుండా ప్రస్తుత నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ’పుత్ర‘ అనే ప్రిఫిక్స్ లేకుండా.. పిల్లలు కలగడం కోసం యాగం అని ఉన్నా కూడా.. ఆధునిక సమాజం వారిని పాజిటివ్ గా తీసుకుంటుంది అని ఆశించవచ్చు.