ప్రత్యేక హోదా కోసం మడమ తిప్పని పోరాటం సాగిస్తాననేది పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాట. దానికోసం రాష్ట్రంలో కొన్ని సభలు నిర్వహించిన తర్వాత.. ఎంపీలకు వ్యతిరేకంగా ఉద్యమించడం, వారిని ఇబ్బంది పెట్టేలా ధర్నాలు చేయడం తదితర కార్యచరణతో ముందుకు సాగుదాం అని పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించారు. తిరుపతి, కాకినాడ సభల వరకు అలాగే కట్టుబడి ఉన్నారు. అయితే అనంతపురం సభ వద్దకు వచ్చేసరికి పవన్ కల్యాణ్ ప్రసంగంలో స్వల్పంగా ‘డీవీయేషన్’ కనిపిస్తోంది. ప్రత్యేకహోదా విషయంలో నెమ్మదిగా రాజీ పడుతున్నారా? ప్రత్యేక ప్యాకేజీ విషయంలో మరికొన్ని ‘సర్దుబాట్లు’ కేంద్రప్రభుత్వం చేసేసి.. దానికి చట్టబద్ధత కల్పించేస్తే అక్కడి సంతృప్తి పడిపోయి.. ప్రజలంతా కూడా సంతృప్తి పడిపోవాలని తన నినాదాన్ని మార్చుకుంటారా? అనే అనుమానం కలుగుతోంది.
కాకినాడ సభకు భిన్నంగా అనంతపురం సభలో పవన్ కల్యాణ్ తన మాటల్లో ప్యాకేజీకి కూడా అనుకూలంగా మొగ్గేలాగా కొన్ని మాటలు చెప్పారు. ‘‘(1) చట్టబద్ధత లేని ప్యాకేజీ మనకెందుకు (2) రాష్ట్రానికి రావాల్సినవి మాత్రమే ఇచ్చి.. అదే స్పెషల్ ప్యాకేజీ అంటున్నారు (3) మనం ఢిల్లీ వెళ్దాం.. మీరు ఇస్తామంటున్న ప్యాకేజీ మాకు చాలదు అని చెబుదాం... ’’ వంటి డైలాగులు పవన్ కల్యాణ్ నోటిలోనుంచి వచ్చాయి. కాకినాడ సభలో ఇలాంటి పరిస్థితి లేదు. అనంతపురంలోనే ప్యాకేజీ గురించి కాస్త మెత్తబడ్డ ధోరణి కనిపించింది.
ఈ వాక్యాలకు అర్థం ‘‘(1) చట్టబద్ధత ఉంటే పవన్ ఒప్పుకుంటాడా (2) రాష్ట్రానికి రావాల్సినవే కాకుండా.. అదనంగా ఇస్తున్నట్లుగా నిరూపిస్తే ఒప్పుకుంటాడా (3) మొన్న ప్రకటించిన ప్యాకేజీకి అదనంగా మరికొన్ని అంశాలు జోడిస్తే.. అక్కడితో తృప్తిపడతాడా...’’ అవుతుందా అనే సందేహాలు జనంలో కలుగుతున్నాయి.
పవన్ కల్యాణ్ నెమ్మదిగా హోదా డిమాండును వినిపిస్తూనే.. ఢిల్లీ కి వెళ్లి కేంద్రంలో పెద్దలను కలిసి.. ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీకి అదనంగా ఒకటి రెండు అంశాలు జోడించేలా కాస్త పావులు కదిపి.. అదంతా తాను సాధించేశానని సెలవిచ్చి.. అక్కడితో తన పోరాటానికి భరతవాక్యం పలుకుతారేమోననే సందేహాలు జనంలో కలుగుతున్నాయి. తన వైఖరి అలాంటిది కాదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి హోదా సాధించే వరకు తాను విశ్రమించేది ఉండదని.. పవన్ కల్యాణ్ తన చిత్తశుద్ధిని ఎలా నిరూపించుకుంటారో చూడాలి.