తాము పరిశుద్ధాత్మ స్వరూపులమని, తమను మించిన స్వచ్ఛమైన నిజాయితీ గలిగిన, నిష్కళంకమైన రాజకీయ నాయకులు మరొకరు ఉండరని భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు. వారి నమ్మకాన్ని మనం కాదనవలసిన అవసరం లేదు. ప్రజలు లెక్కల్లో లేకుండా దాచుకున్న చిన్న మొత్తాల డబ్బును.. తెచ్చి బ్యాంకుల్లో వేసుకుంటూ ఉంటే.. ‘అదంతా జనం నల్లధనమే’ అని వ్యాఖ్యానించే వారి అహంకారం బాధ కలిగిస్తుంది అంతే. అయితే నోట్ల రద్దు తర్వాత.. పార్టీ మీద ఆరోపణలు వస్తోంటే.. భాజపాకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ తమ బ్యాంకు ఖాతాల బ్యాలెన్స్ షీట్ లను పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు ఇవ్వాలంటూ ఓ హుకుం జారీ అయింది. ఈ నిర్ణయం ద్వారా.. తాము కడిగిన ముత్యంలాగా నిగ్గుతేలుతామని, తాము ఎంతో పరిశుద్ధులమనే ముద్ర వస్తుందని పార్టీ ఆశిస్తన్నట్లుగా కనిపిస్తోంది.
తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, ఇంకా వివిధ ప్రాంతాల్లో మీడియా ముందు మాట్లాడడానికి అవకాశం దొరుకుతున్న ప్రతి భాజపా నాయకుడు కూడా.. తమ అధ్యక్షుడు ప్రకటించిన విషయాన్ని నభూతో నభవిష్యతి అనదగినంతటి అపురూపమైన నిర్ణయంగా అభివర్ణించడానికి, మసిపూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరే ఇతర పార్టీ వారికైనా ఇంత ధైర్యం ఉంది. తమ ప్రజాప్రతినిధుల బ్యాంకు ఖాతాలను బయటపెట్టగలరా? అంటూ పదేపదే సవాళ్లు విసురుతున్నారు. ఇలా సవాళ్లు విసరడం వల్ల.. మోదీని నిందిస్తూ ఇరుకున పెడుతున్న విపక్షాల మీద పైచేయి సాధించడం కుదురుతుందని భాజపా నేతలు మురిసిపోతున్నట్లుగా ఉంది.
కానీ వాస్తవంలో పరిస్థితి వేరు. నవంబరు 8వ తర్వాత బ్యాంకు ఖాతాలను అమిత్ షాకు ఇవ్వడం కాదు కదా.. ఆ బ్యాలెన్స్ షీట్ లను ఆన్‌లైన్ లో ప్రజలందరి ముందు ఉంచినా కూడా జనం వారిని నమ్మే పరిస్థితి దాటిపోయింది. నోట్ల రద్దు గురించి భాజపా నేతలకు ముందే తెలుసునని, నవంబరు 8 కి ముందే అంతా సర్దేసుకున్నారనేది అసలు ఆరోపణ అయినప్పుడు.. దాన్ని వదిలేసి.. ఇలాంటి గిమ్మిక్కులు ప్రయోగిస్తే ఉపయోగం ఏముంటుందన్నది జనం ఉవాచ. ఒక రకంగా చెప్పాలంటే.. అమిత్ షా కాస్త తొందరపాటుతో ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించారని, ఈ నినాదం బ్యాక్‌ఫైర్ అయిందని పలువురు విశ్లేషిస్తున్నారు.