నోట్లమార్పిడి నల్లకుబేరులకు వరంగా మారిందా?

Update: 2016-12-07 05:03 GMT

‘‘నల్లధనం అంతు తేల్చడానికి నోట్ల రద్దు ప్రవేశపెట్టాను.. దీనివల్ల కుబేరుల ఆట కడుతుంది.. సామాన్యులకు కొన్ని ఇబ్బందులు తప్పవు.. కానీ జాతి విస్తృత ప్రయోజనాల కోసం భరించండి..’’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ అంటున్నారు. కొన్ని వారాలుగా జనం నానా పాట్లు పడుతూనే ఉన్నారు. అయితే కొన్ని పరిణామాలను గమనిస్తోంటే..మోదీ ప్రకటించిన నోట్ల రద్దు అనే ప్రక్రియ నిజమైన నల్లకుబేరులకు పెద్ద వరంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందరూ తమ వద్ద ఉన్న రద్దయిన నోట్లను మార్చుకుని తాజా సరికొత్త నోట్లతో మళ్లీ నల్లధనం ఇనప్పెట్టెల్లో నింపేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇలాంటి సందేహాలకు సహేతుకత ఇదీ..

- ప్రభుత్వ వైఫల్యం గురించి రకరకాల ఆరోపణలు చేస్తున్న విపక్షాల మాటల్లో.. సంపన్నులు ఒకరైనా బ్యాంకుల వద్ద క్యూలలో నిల్చున్నారా? అనే ప్రశ్న వినిపిస్తోంది. సిల్లీగా కనిపించినా ఈ ప్రశ్నలో నిజముంది. కష్టాలన్నీ పేదలకు మాత్రమే వస్తున్నాయి.

- చాలా చోట్ల చాలా పెద్ద మొత్తాల్లో కొత్తనోట్లు తరలుతూ పట్టుబడుతున్నాయి. బ్యాంకు నుంచి ఒక్క 2000 నోటు రావడం సామాన్యుడికి గగనం అవుతుండగా, కొందరు కుబేరుల వద్ద కోట్ల రూపాయల మేర కొత్త 2000 నోట్లు బయల్పడి ఆశ్చర్యం కలిగించిన సంఘటనలున్నాయి. రోడ్లమీద రవాణా అవుతూ కూడా.. కోట్ల రూపాయల కొత్త నోట్లు పోలీసులకు దొరుకుతున్నాయి. అంటే ఇవన్నీ ఎవరో కుబేరుల ఖాతాకు చెందినవే అని అనుకోవాలి.

- పోలీసు తనిఖీల్లో పలు చోట్ల కొత్తనోట్లు ఉన్నాయ్.. పాతనోట్లు ఇచ్చే వాళ్లున్నారా అంట దళారీపనిచేసే మాఫియాలు వెలుగుచూస్తున్నాయి. అంటే వీరిచేతికి కొత్తనోట్లు చేరాయన్నమాట. ఇదంతా నల్లకుబేరులకు ఉపకరిస్తున్న పరిణామాలే.

అన్నిటినీ మించి మరో సూచన కూడా ఉంది.

- అహ్మదాబాద్ లో మహేష్ షా అయినా, హైదరాబాదులో బాణాపురం లక్ష్మణరావు అయినా.. మరొకరి సొత్తుకు బినామీలుగా ఉండడానికే పదివేలకు పైగా నల్లధనం తమ వద్ద ఉన్నట్లు స్వచ్ఛంద ఆదాయ పథకంలో వెల్లడించారని అర్థమవుతోంది. అయితే తొలివిడత పన్ను కట్టాల్సిన సమయం వచ్చేసరికి ఈ ఇద్దరు బినామీ లూ ఒకే తరహాలో చేతులు ఎత్తేశారు. అంటే దాని అర్థం.. వారిని వాడుకోజూసిన అసలు సిసలు నల్లకుబేరులు ఈలోగా సైలెంట్ అయిపోయారన్నమాట. అంటే నోట్ల రద్దు అనంతర పరిణామాల్లో వారంతా.. తమ వద్ద ధనాన్ని మార్చుకుని సేఫ్ అయిపోయి ఉంటారని, అందుకే ఈ ఇద్దరూ ఇలా ఇరుకున పడ్డారని అంతా అనుకుంటున్నారు.

...

ఇలాంటి పరిణామాలను గమనిస్తున్నప్పుడు.. మోదీ ప్రకటించిన నోట్ల మార్పిడి వ్యవహారం నల్లకుబేరులకు అన్ని రకాలుగానూ లాభం చేకూర్చినట్లు కనిపిస్తోంది. ఎవరికి వారు అంతా సర్దుకున్నారని సామాన్యులు మాత్రం రోడ్డున పడ్డారని అర్థమవుతోంది.

Similar News