నల్లడబ్బు ప్రస్థానం.. పాత నుంచి కొత్తనోట్లలోకి...

Update: 2016-12-08 06:00 GMT

దేశంలో నల్లధనాన్ని సమూలంగా అంతం చేసేస్తాం.. అని మోదీ సర్కారు ప్రకటించింది. అందుకు వారి చిత్తశుద్ధి నిజాయతీతో కూడుకున్నదే కావొచ్చు గాక.. కానీ.. ఇవాళ్టికి నల్లధనం అంతరిస్తున్నదని గుండెలపై చేయివేసుకుని చెప్పగలిగిన పరిస్థితి పాలకులకే లేదు. అయితే ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న చాలా సంఘటనలను గమనిస్తున్నప్పుడు.. నల్లడబ్బు పాత నోట్లనుంచి కొత్త నోట్లలోకి మారి.. అదే నల్లకుబేరుల రహస్య ఖజానాల్లో మళ్లీ తిష్ట వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఎక్కడపడితే అక్కడ లక్షలు, కోట్ల రూపాయల విలువైన కొత్త 2000 నోట్లు ప్రెవేటు వ్యక్తుల దగ్గర బయటపడుతున్నాయి. ఒక్క 2000 నోటు కోసం సామాన్యుడు నాలుగైదు గంటలు క్యూల్లో నిలబడుతోంటే.. కోట్లాది రూపాయల విలువైన కొత్త కరెన్సీ ఎలా చేతులు మారుతున్నదో తెలియదు. బెంగుళూరులో నాలుగుకోట్ల కొత్తనోట్లు ఇద్దరి ఇళ్లలో దొరికాయి. తెలుగురాష్ట్రాల్లో లక్షల్లో కొత్తనోట్లు తరలిస్తూ దొరికిన వాళ్లు అనేక కేసులున్నాయి. తాజాగా గాలిజనార్దనరెడ్డి వంద కోట్ల రూపాయలు కొత్త నోట్ల లోకి మార్చుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో భాజపా పాలనలోని గోవా రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. అక్కడ ఇద్దరు వ్యక్తుల వద్ద 70 లక్షల విలువైన కొత్త 2000 నోట్లను పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక రోజులో 1.5 కోట్ల రూపాయల విలువైన ఇలాంటి కొత్తనోట్ల అక్రమ ధనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఉత్తరగోవాలో ఇద్దరు వ్యక్తులు డబ్బు తరలిస్తున్నట్లుగా సమాచారం రావడంతో తాము వలపన్ని వారిని పట్టుకున్నట్లు ఎస్పీ కార్తీక్ కాశ్యప్ చెప్పారు. దక్షిణ గోవాలోని మరో చోట ఒకే వ్యక్తి వద్ద మరో 35 లక్షల రూపాయలను పట్టుకున్నారు.

ఇలాంటి సంఘటనలన్నీ గమనిస్తోంటే.. నల్లకుబేరుల సొమ్ము చాలా సేఫ్ గా ఇప్పటికే రూపు మారిపోయిందని.. సామాన్యులు మాత్రమే ఇంకా కష్టాలు పడుతున్నారని అనిపిస్తోంది. మరి విచ్చలవిడిగా జరుగుతున్న ఇలాంటి అరాచక పోకడలకు అడ్డుకట్ట వేయడం ఎలాగ?

సీబీఐ రంగంలోకి దిగి అక్రమాలకు పాల్పడిన కొందరు పోస్టల్ అధికారులను అరెస్టు చేసింది. బ్యాంకుల్లో జరిగిన లావాదేవీల్లో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ అక్రమాలకు పాల్పడిన దళారీలు దొరికినంత మాత్రాన వారి ద్వారా అసలు తెరవెనుక ఉన్న నల్లకుబేరుల్ని కూడా పట్టుకోవడం సాధ్యమవుతుందో.. లేదా, అక్కడిదాకా వచ్చేసరికి యథోరీతి లాలూచీ వ్యవహారాలు పైచేయి సాధిస్తాయో చూడాలి.

Similar News