వైవాహిక బంధం అనేది.. మూడు సార్లు తలాక్ అనే పదం పలికితే తెగిపోతుంది! ఒకప్పట్లో మతపరంగా ఎలాంటి సామాజిక నేపథ్యంలో ఈ పద్ధతి ఆచారంగా వచ్చిందో గానీ.. ఆధునిక సమాజంలో ఎంతో మంది ముస్లిం మహిళల జీవితాలు నడిసంద్రంలో శిథిలం అయిపోతుండడానికి ఈ దుర్మార్గపు ఆచారం కారణం అవుతోంది. ముస్లిం మహిళా సంఘాలు కొన్ని చాలా కాలంగా ఈ వ్యవస్థకు దురాచారానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాయి. అయితే తొలిసారిగా మోదీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వం తలాక్ ఆచారాన్ని తొలగించడానికి చట్టబద్ధమైన ఏర్పాటు చేయబోతున్నది. సహజంగానే ముస్లిం మతపెద్దలు, ఆ మతంలోని కొన్ని వర్గాల నుంచి ఇలాంటి ప్రయత్నానికి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.
తలాక్ ఆచారాన్ని రూపుమాపడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకోజూస్తున్న వారందరూ కూడా దీనికి మరో కోణంలో మరో రంగు పులుముతున్నారు. ముస్లిం పర్సనల్ లా విషయంలో ఏ ప్రభుత్వం జోక్యం చేసుకున్నా కూడా సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మతపరమైన పర్సనల్ లాబోర్డు లో కేంద్రం జోక్యం చేసుకుంటున్నదనే డైలాగు వాడడం ద్వారా విషయాన్ని భూతద్దంలో చూపి, పెద్ద రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఢిల్లీలో ఇమాములు, బుఖారీలు మాట్లాడినా, హైదరాబాదులో ఒవైసీలు మాట్లాడినా అందరిదీ ఒకటే మాట... ‘పర్సనల్ లా లో వేలు పెడితే ఊరుకోం’ అనే !
కానీ, వాస్తవం ఏంటంటే.. పర్సనల్ లా లో వేలు పెట్టడానికి, తలాక్ దురాచారాన్ని రూపుమాపడానికి సంబంధం లేదు. నిజానికి ఈజిప్టు, పాకిస్తాన్ వంటి అనేక ముస్లిం దేశాలే.. తలాక్ ఆచారాన్ని ఎప్పుడో రద్దు చేసేశాయి. అలాంటిది... మనదేశంలో మాత్రం వెనుకబాటు తనానికి ప్రతీకగా అది ఇంకా కొనసాగుతోంది. ముస్లిం మహిళల జీవితాలతో ఆటలాడుకుంటోంది. తలాక్‌ను రద్దు చేయడం, పర్సనల్ లాబోర్డుకు సంబంధం లేని వ్యవహారం అనే ముస్లిం పెద్దలకు కూడా అవగాహన కల్పించడానికి కేంద్రం కూడా ప్రయత్నిస్తున్నది.
ఈ రెండింటినీ వేర్వేరుగా చూడాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ.. తలాక్ దురాచారాన్ని రద్దు చేయడానికి కేంద్రం కృత నిశ్చయంతోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదే జరిగితే.. ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ముస్లిం మహిళల జీవితాలకు ఓ భరోసా కల్పించినట్లు అవుతుందని పలువురు భావిస్తున్నారు.