డియర్ పవన్ కల్యాణ్ జీ! : ఇట్లు మీ విధేయుడు!

Update: 2016-11-27 06:39 GMT

డియర్ పవన్ కల్యాణ్ గారూ..

మీకు ఆవేశం వస్తే భూమ్యాకాశాలు ఏకం అయిపోతాయి. అవతలి వాళ్లు ఎంత పెద్దవాళ్లో మీకు అనవసరం.. ఎడాపెడా దులిపేయడం మీకు మాత్రమే చెల్లింది. రాజకీయ నాయకులు కూడా కాస్త ఆచితూచి ప్రత్యర్థుల్ని తిడుతుంటారు. కానీ ఆ విధముగా ఆచడమూ తూచడమూ వంటివేమీ లేకుండా.. నోటికి ఎలా వస్తే అలా ఎద్దేవా చేస్తూ.. జనంతో హాహాకారాలూ, హర్షధ్వానాలూ చేయించుకోవడం మీకే తగు. అందుకే మీ సభల్లో ఎప్పుడు చూసినా.. మీ ప్రసంగం వారికి వినపడకుండా పోయేంత పెద్దపెట్టున యువతరం ఆద్యంతమూ కేకలు పెడుతూనే ఉంటారు. అది వేరే సంగతి.

ఇప్పుడు విషయానికి వస్తే.. నోటు కష్టాల విషయంలో మీరు ట్వీటు చేసిన తర్వాత.. కొత్తగా ప్రభుత్వంలో ఏం కదలిక వచ్చిందో చెప్పడం కష్టం. ఎందుకంటే వాళ్లంతా అసలు కష్టాలే లేవు.. జనం అంతా అద్భుతంగా మా నిర్ణయాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు అని చెప్పుకునే ప్రయత్నంలోనే ఉన్నారు.

కానీ పవన్ కల్యాణ్ గారూ.. జనం కష్టాలు పాలకులకు తెలియడానికి మీరు ఓ మార్గం చెప్పారు. కేంద్రమంత్రులు, ఎంపీలను తీసుకువచ్చి క్యూలైన్లో నిలబెట్టాలని అన్నారు. మంచి మాట. చాలా సంతోషం. కానీ విషయం ఏంటంటే.. కష్టాలు క్యూలైన్లో నిల్చోవడం మాత్రమే కాదు. నిజం చెప్పాలంటే.. నోటు దెబ్బ కష్టాల్లో వాటి వాటా పది శాతం కూడా లేదు. క్యూలైన్లో నిల్చుంటే పని వృథా కాలహరణం మాత్రమే.. లైన్లో ఉండి చనిపోయిన వ్యక్తి మరణం మిమ్మల్ని కలచివేయడం మీ ట్వీట్ లో కనిపించింది. కానీ అంతకంటె ముఖ్యంగా.. మందుల కోసం రద్దయిన నోటును తిరస్కరిస్తే.. గుండెపోటు వచ్చిన వ్యక్తి ఈలోగా దుర్మరణం చెందడం, మంత్రి సోదరుడి శవాన్ని తీసుకెళ్లే వెసులుబాటు లేకపోవడం.. ఉత్తరాంధ్రలో తండ్రి చనిపోతే హైదరాబాదులో ఉన్న ముగ్గురు పిల్లలు డబ్బులున్నా.. చెల్లే డబ్బులు లేక అంత్యక్రియలకు వెళ్లలేకపోవడం... భార్యే చితికి నిప్పు పెట్టడం ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు పవన్ కల్యాణ్ గారూ!

నిజం చెప్పాలంటే.. మన నేతల్ని కేవలం బ్యాంకు క్యూలైన్లో నిల్చోబెట్టడం చాలదు. వారిని ఆత్మవంచన చేసుకోకుండా జనం మధ్యలో తిరగమని చెప్పాలి.. ఎన్ని రకాల యాతనలను ప్రజలు అనుభవిస్తున్నారో.. సామాన్యుడి జీవితం ఎన్ని రకాలుగా ఛిద్రం అయిపోతున్నదో.. వారికి తెలియాలి. వారని చెర్నాకోలతో అదిలించాలంటే... ముందు ఇన్ని రకాల కష్టాలు జనం అనుభవిస్తున్నారనే సంగతి మీకు కూడా తెలియాలి. మీ మాటకు శక్తి ఉంది. మీ చేతలకు కూడా అంతకంటె బలం ఉంటుంది. మీరు ట్వీట్‌లను పక్కన పెట్టి రోడ్డు మీదకు రావాలి. సభలు , ప్రెస్‌మీట్‌లు కాదు అంతకుమించిన కార్యచరణ లోకి ఉపక్రమించాలి. ప్రభుత్వంలో కదలిక రావాలంటే.. ముందు మీలాంటి ఉద్యమశీలత ఉన్నవారిలో కదలిక రావడం చాలా ముఖ్యం. ఏమంటారు??

- ఇట్లు

మీ విధేయుడు

Similar News