1) మీ చేతిలో ఉండే ఏటీఎం కార్డును ఒకసారి స్వైప్ చేసి.. కేవలం ఆరు సెకన్ల వ్యవధిలో దానికి నకిలీ కార్డును సృష్టించవచ్చు అనే సంగతి మీకు తెలుసా? నకిలీగా తయారైన కార్డు ద్వారా దాని పిన్ నెంబరును కూడా సులువుగా గ్రహించవచ్చునని తెలుసా? ఒకసారి నకిలీ సిద్ధం కాగానే.. ఇక మీ అకౌంట్లో మీరు డబ్బు వేస్తూ ఉంటే.. మరెక్కడో మీకు తెలియకుండానే విత్ డ్రా అయిపోకుండా ఉంటుందా?
2) మీరు యాప్ ద్వారా లావాదేవీలు చేస్తారు. అయితే మీ మొబైల్ లో ఉండే మరొక యాప్.. మీరు టైపు చేసే సమస్త పాస్ వర్డ్ లను చోరీ చేయకుండా ఉంటుందనే గ్యారంటీ ఉందా?
డిజిటల్ లావాదేవీల విషయంలో ఇలాంటి భయాలు చాలా ఉన్నాయి.
అందుకే డిజిటల్ ఆర్థిక లావాదేవీల వినియోగం గురించి ఆసక్తి పెంచుకుంటున్న కొత్త వ్యక్తులు దానితో సమానంగా సైబర్ నేరాల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మొదటికే మోసం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిజానికి ప్రజలకు డిజిటల్ మనీ వినియోగంతో పాటూ, ఇందులో ఎలాంటి మోసాలు జరగడానికి అవకాశం ఉన్నదో కూడా ప్రజలకు చైతన్యం కలిగించడం అనేది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. జరిగే అవకాశం ఉన్న మోసాల గురించి కూడా చెబితే.. ప్రజలు వాడడం మానేస్తారేమో అనే భయం సర్కారుకు ఉంటే ఉండవచ్చు గాక.. కానీ, వారికి చెప్పకపోతే.. ప్రజలు అన్యాయం అయిపోయే ప్రమాదం చాలా ఎక్కువ.
ఒకవైపు ప్రభుత్వాలు యాప్ లు కూడా రూపొందించేస్తూ.. ప్రజలను డిజిటల్ వినియోగం వైపు ప్రోత్సహిస్తున్నాయి. ఇదంతా మంచి పరిణామమే అయితే ముందు ముందు వారికి ఇబ్బందులు, చికాకులు ఎదురుకాకుండా ఉండాలంటే.. అందులో పొంచిఉన్న ప్రమాదాల గురించి కూడా చెప్పాలని పలువురు కోరుతున్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో చైతన్యం, అవగాహన కలిగిస్తేనే.. ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది.