ట్రంప్ నాదం : ఐటీ రంగానికి ప్రమాద ఘంటికలు!

Update: 2016-12-07 12:52 GMT

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలను ఇంకా స్వీకరించాల్సి ఉంది. కానీ అప్పుడే ఆయన పాలన తాలూకు శాంపిళ్లు గోచరం అవుతున్నాయి. అనేక రంగాలకు సంబంధించి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా.. ఇతర దేశాలకు సంబంధించిన వ్యవహారాలపై అత్యంత దూకుడు వ్యాఖ్యలు చేస్తూ స్వదేశీ ఓటర్ల అభిమానం పొందిన ట్రంప్, తాను పాలకుడిగా మారిన తర్వాత కూడా అదే తరహాలో వెళుతుండడం.. కొందరిని సందిగ్ధంలో పడేస్తుండగా, కొన్ని రంగాల్లో భయాందోళనలకు కారణం అవుతోంది.

ప్రధానంగా ఐటీ రంగం కూడా ట్రంప్ దెబ్బకు ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాలో స్థిరపడిన ఐటీ పరిశ్రమల కంటె.. విదేశాలనుంచి అవుట్ సోర్సింగ్ సేవలను పొందుతున్న ఐటీ సంస్థల పరిస్థితి ప్రమాదంగా మారుతోంది. అంతిమంగా భారత్ లోని ఐటీ కంపెనీల మీద ట్రంప్ దుష్ర్పభావం భారీగా ఉండేలా కనిపిస్తోంది.

విదేశాల నుంచి అవుట్ సోర్సింగ్ సేవలను పొందుతున్న అమెరికన్ కంపెనీల మీద 35 శాతం పన్ను విధించబోతున్నట్లుగా ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇది నేరుగా భారతీయ ఐటీ కంపెనీల మీద ప్రభావం చూపిస్తుంది. భారత్ లోని ఐటీ రంగం గరిష్టంగా అమెరికన్ కంపెనీలకు అవుట్ సోర్సింగ్ సేవలను అందించడం మీదనే ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ రంగం భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదనే భయసందేహాలు రేకెత్తుతున్నాయి.

మామూలు పరిస్థితుల్లో అయితే ఐటీ రంగానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నదనే నినాదంతోనే భారతీయ యువతరం తమ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నది. ఇవాళ్టికి కూడా.. ఎంసెట్ తర్వాత.. మెజారిటీ విద్యార్థులు ఐటీ, కంప్యూటర్ సైన్స్ రంగాల వైపే మొగ్గుతుండడానికి ఇదే కారణం. అయితే.. అమెరికా రాజకీయాల్లో తాజా మార్పుల నేపథ్యంలో కొత్త భయాలు పుట్టుకొస్తున్నాయి.

ట్రంప్ ఎన్నికలకు ముందునుంచే ఇలాంటి మాటలు చెబుతున్నప్పటికీ పరిశ్రమ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చెబుతున్న మాటలను కొట్టిపారేయడానికి వీల్లేదు. ఇటీవలి పరిణామాలు కూడా ఆ భయాలకు మరో కారణం అవుతున్నాయి. మరీ ఐటీ రంగం ఎలాంటి ప్రత్యమ్నాయాలు చూసుకుని స్థిరంగా మనుగడ సాగిస్తుందో వేచిచూడాలి.

Similar News