దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి మోదీ చేస్తున్న ప్రయత్నాల్ని ప్రజలు సహనంతో అర్థం చేసుకుంటున్నారు. ఆయన మంచి ప్రయత్నం చేస్తున్నాడు అనే నమ్మకం ఉన్నది గనుకనే.. దేశమంతా ఇవాళ నానా కష్టాలు పడుతూ ఆయన వెంట నిలుస్తున్నది. అంత మాత్రాన నవంబరు 8వ తేదీ తర్వాత బ్యాంకుల్లోకి వస్తున్న ప్రతిరూపాయీ.. నల్లధనమే అని వ్యాఖ్యానిస్తే అది భారత జాతిని అవమానించడమే. ఈ దేశంలోని మధ్యతరగతిని అనుమానంగా చూడడమే, దారుణంగా అవమానించడమే. చిన్న చిన్న పొదుపులు చేసుకుని.. కాసింత పెద్ద మొత్తాల్లో నగదురూపేణా కూడబెట్టుకున్న ప్రతి ఒక్కరి వద్ద ఉన్న ధనమూ నల్లధనమే అని అంటే .. అలా వ్యాఖ్యానించిన వారి అహంకారానికి అది అద్దం పడుతుంది. ఆర్థికమంత్రి జైట్లీ మంగళవారం అలాంటి తప్పిదానికే పాల్పడ్డారు.
లోక్‌సభలో ఐటీ చట్టం సవరణ బిల్లుకు ఆమోదం పొందే ప్రయత్నంలో భాగంగా విపక్షాల ఆందోళనల మధ్య జైట్లీ ప్రసంగించారు. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడానికి కూడా ప్రత్యేక చట్టం తెస్తాం అంటూ జైట్లీ చెప్పారు.
ఈ చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8వ తేదీనుంచి ఇవాళ్టి వరకు దేశంలోని నల్లధనం 70 వేల కోట్లు బయటకు వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా బ్యాంకుల్లోకి వచ్చిన ధనం మొత్తం నల్లధనం అని జైట్లీ ఎలా వ్యాఖ్యానించగలరో అర్థం కావడం లేదని మధ్యతరగతి, సామాన్యులు విస్తపోతున్నారు.
దేశవ్యాప్తంగా వందల వేల కోట్ల రూపాయల నల్లదనం కలిగి ఉన్న వారెవ్వరూ బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిల్చుంటూ ఇబ్బందు పడడం లేదని, ఎవరికి వారు కొత్త కొత్త వక్రమార్గాల్లో నగదును మార్పిడి చేసేసుకుంటున్నారని.. కాకపోతే చిన్న మొత్తాల్లో సేవింగ్స్ ఉండే మధ్యతరగతికి, సామాన్యులకు మాత్రమే ఎక్కడలేని చిక్కులు వచ్చి పడ్డాయని అందరూ వాపోతున్నారు. విపక్షాలు కూడా ప్రధానంగా ఈ అంశాల మీదనే ఉద్యమిస్తున్నాయి. అలాంటిది అరుణ్ జైట్లీ మాత్రం కనీస విచక్షణ లేకుండా.. దేశంలో బ్యాంకుల్లోకి వస్తున్న సమస్తం నల్లధనం అంటూ ఒకే గాటన జమకట్టేయడం జనానికి ఆగ్రహం తెప్పించేదిగా ఉంది. అసలే నానా కష్టాలు పడుతూన్న ప్రజలు తాము ఇలాంటి నిందలు కూడా భరించాలా అంటూ జైట్లీ దృక్పథాన్ని తప్పపడుతున్నారు.