జగన్ దూకుడులో తేడా గమనించారా?

Update: 2016-12-01 19:23 GMT

వైఎస్ జగన్మోహన రెడ్డి యాత్రలు, పర్యటనలు, కార్యక్రమాల విషయంలో ఇదివరకటికి ఇప్పటికి పెద్దగా తేడా ఏమీ లేదు. ఇదివరకు కూడా.. ఆయన రెగ్యులర్ రాజకీయ నాయకుడులాగా , ప్రొఫెషనల్ గా వ్యవహరించింది లేదు. తాను సంకల్పించిన ఓదార్పు యాత్ర సమయంలో విపరీతంగా కష్టపడుతూ ఊళ్ల మీద పడి తిరగడం, యాత్ర షెడ్యూలు ముగిసిన వెంటనే.. ఇక అసలు జనబాహుళ్యానికి కంటపడకుండా.. తన సౌధాల్లో కొలువుతీరడం ఆయనకు అలవాటు. అలాంటి వ్యవహార సరళిలో అప్పటికీ ఇప్పటికీ పెద్దగా మార్పులేదు. అయితే ఒక్క విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.

జగన్మోహన రెడ్డి ... వైఎస్ రాజశేఖర రెడ్డి తరువాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగల అర్హత తనకు ఒక్కడికే సంక్రమించిదని, దాన్ని అందరూ లాక్కున్నారని భావిస్తుండే వ్యక్తి. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా కూడా.. జగన్ ఆయన ముఖ్యమంత్రిత్వాన్ని ఆమోదించలేకపోతున్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యే శుభవేళ గురించి ఆయన తరచుగా చెబుతూ ఉంటారు. ఇక్కడే అసలు ట్విస్టు ఉంది.

ఇదివరలో అంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో జగన్మోహన రెడ్డి తాను ముఖ్యమంత్రి కాగల సమయం గురించి చాలా దూకుడుగా మాట్లాడుతుండేవాళ్లు. ఏ క్షణంలో అయినా మన వైకాపా ప్రభుత్వం రావచ్చు.. చంద్రబాబు ప్రభుత్వం కుప్పకూలిపోయి మన ప్రభుత్వం వస్తుంది.. నేను సీఎం కాగానే మీ కష్టాలు తీరుస్తా.. అని చెబుతుండేవాళ్లు. తాను కనుసైగా చేస్తే.. తెదేపా ఎమ్మెల్యేలు ఫిరాయించి వచ్చేస్తారంటూ అన్న సందర్భాలు అనేకం. ఆ నేపథ్యంలో వైకాపా మీద ఆకర్ష మంత్రం ప్రయోగించిన చంద్రబాబు దాదాపు 20 మందిని తమ పార్టీలో కలిపేసుకోవడంతో జగన్ కు పెద్ద దెబ్బే తగిలింది.

అంత పెద్ద దెబ్బ తగిలాక ఆయన దోరణి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు రేపో మాపో మన ప్రభుత్వం వచ్చేస్తుంది అనే మాట ఆయన నోటమ్మట రావడం లేదు. కనీసం రెండేళ్ల తర్వాత అయినా మన ప్రభుత్వం వస్తుంది కదా.. అప్పుడు ఈ చంద్రబాబు చేస్తున్న తప్పులు అన్నిటినీ సరిదిద్దుదాం అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా సరే.. అది రెండేళ్లలోగా కుదరదు అనే వాస్తవాన్ని.. ఓ ఇరవై మంది ఎమ్మెల్యేలను కోల్పోయిన తర్వాతగానీ జగన్ అర్థం చేసుకున్నట్లు లేదు.

Similar News