చంద్రబాబు మందలింపులు మొక్కుబడి కాకూడదు!

Update: 2016-10-06 03:16 GMT

ముందుగా ఓ కథ చెప్పుకోవాలి.

''అనగనగా ఓ పిసినారి దంపతులు ఉండేవారు! వారికి ఎంగిలిచేత్తో కాకిని విదిలించడం కూడా ఇష్టముండదు. ఒకరోజు వారు మంచిగా పిండివంటలు చేసుకున్న సమయంలో భోజనవేళకు అనుకోకుండా ఓ అతిథి వచ్చాడు. అంతలో హఠాత్తుగా భార్యాభర్తల మద్య తగాదా మొదలైంది. ఇద్దరూ చాలా దారుణంగా అరుచుకున్నారు. ఆ భర్త ఆమె పై చేయిచేసుకున్నాడు. ఆమె ఏడుస్తూ కూర్చుంది. ఇదంతా చూసి కంగారెత్తిన అతిథి.. భోజనం సంగతి పట్టించుకోకుండా.. పరారయ్యాడు. అతను వెళ్లిపోగానే.. ''నేను కొట్టాలని కొట్టలేదే పెళ్లామా''అని భర్త సంజాయిషీ ఇవ్వబోతే.. నేను కూడా ఏడవాలని ఏడవలేదు మొగుడా'' అంటూ భార్య ముక్తాయించిందట. అతిథిని తప్పించుకోవడానికి వారు అలా తగాదా డ్రామా ఆడారన్నమాట. ''

... ఇది సరదాగా చెప్పుకునే కథ! ప్రస్తుతం చంద్రబాబునాయుడు వ్యక్తం చేస్తున్న ఆగ్రహం కూడా ఇలాగే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో సైతం కిందిస్థాయిలో ఇసు బకాసురులు తెగబలిసి.. దారుణమైనస్థాయిలో దందాలు నడిపిస్తున్న వైనం అందరికీ తెలిసిన సంగతే. అయితే పత్రికలో వాటి మీద కథనం రాగానే .. చంద్రబాబు ఆ సంగతి ఇప్పుడే తనకు తెలిసినట్లుగా ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమంలో ఆ దందాలపై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.

కిందిస్థాయి వాళ్లు ఇసుక దోపిడీ చేస్తోంటే.. ఎమ్మెల్యేల స్థాయిలో సెట్‌ చేయాలి. మీకు చేతకాకపోతే.. నేను రంగంలోకి దిగుతా.. అంటూ ఏదో చంద్రబాబునాయుడు.. ఆవేశాన్ని ప్రదర్శించి అక్కడితో ఫుల్‌స్టాప్‌ పెట్టారు. కానీ పత్రికల్లో వచ్చింది గనుక.. మొక్కుబడి కోపం తెచ్చుకోకుండా.. చంద్రబాబు నిర్దిష్టమైన యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకెళ్లి.. అధికార పార్టీ అండతో సాగే ఇసుక దందాలనుంచి ప్రజలను రక్షించాల్సి ఉంది.

Similar News