గళాలకు శిక్షణ ఇస్తే బలం పెరుగుతుందా?

Update: 2016-10-14 03:34 GMT

రాష్ట్ర విభజన పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా శవాసనం వేసింది. దాన్ని లేపి నిలబెట్టడానికి, మళ్లీ కార్యక్షేత్రంలో సజీవంగా ఉన్నట్లుగా కనిపించడానికి ఆ పార్టీ పీసీసీ నాయకులుగా రఘువీరా రెడ్డి, పార్టీలో మిగిలిన ఉన్న మరికొందరు ప్రముఖులు ఇప్పటిదాకా చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రత్యేకహోదా అనేది తాము ఇచ్చేశాం భాజపా ఇవ్వట్లేదు అనే నినాదంతో.. వారు ప్రజలను మెప్పించాలని నానా పాట్లు పడ్డారు. రకరకాల ఉద్యమాలు నిర్వహించారు. అయితే పెద్దగా ఫలితం మాత్రం దక్కలేదు.

అయితే విభజన పాపం జరిగి రెండున్నరేళ్లు అయిపోతుండగా.. ఇప్పటికీ తమ పార్టీ తిరిగి కోలుకోలేకపోవడం గురించి కేంద్రంలోని జాతీయ పార్టీ నాయకత్వానికి చింతగా ఉన్నట్లుంది. పీసీసీ స్థాయిలోని నాయకులు, అధికార ప్రతినిధులు సరిగ్గా వ్యవహరించడంలేదనే అభిప్రాయం కూడా కలిగినట్లుంది. అందుకే వారికి శిక్షణ ఇచ్చి గాడిలో పెడితే పార్టీని ఉద్ధరించేస్తారనే అభిప్రాయానికి వచ్చినట్లున్నారు. ఏపీలోని పీసీసీ అధికార ప్రతినిధులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడానికి విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

అయినా కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను గుర్తెరగకుండా.. ప్రజల్లో తమ పార్టీ పట్ల వ్యతిరేకంత ఎంత బలంగా వేళ్లూనుకుందో తెలుసుకోకుండా చేసే ప్రయత్నాలన్నీ వృథానే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం పాలకపక్షంగా తెదేపా, భాజపాలు, విపక్షంగా వైకాపా పూర్తస్థాయిలో పాదుకొని ఉన్నాయి. అక్కడేమీ రాజకీయ శూన్యత లేదు. ఇలాంటి నేపథ్యంలో.. యాక్టివిటీ పెంచితే పార్టీ మళ్లీ వెలుగులోకి వస్తుందని అనుకోవడం వారి భ్రమ అని పలువురు భావిస్తున్నారు. కేవలం యాక్టివిటీ పెంచడం వల్ల ఏమీ ఒరగదని, వారికి ఇప్పటికే ఉన్న చెడ్డపేరు మొత్తం పోతే తప్ప పార్టీ పునరుత్థానం జరగదని అంటున్నారు. పార్టీకి అధికారిక గళంగా ఉపయోగపడగలిగే వారికి శిక్షణ ఇచ్చినంత మాత్రాన బలం ఎలా పెరుగుతుంది? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఆ వాస్తవాన్ని తెలుసుకోకుండా కుంతియా, కేవీపీ, కొప్పులరాజు లాంటి వాళ్లు వచ్చి ఏదో నామ్ కేవాస్తే గా అధికార ప్రతినిదులకు ఓ శిక్షణ కార్యక్రమం పెట్టేసి వెళ్తే ప్రయోజనం లేదనే అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది.

Similar News