కోదండాస్త్రం పదునెక్కుతోంది!!

Update: 2016-11-10 04:01 GMT

తెలంగాణ ఉద్యమ నాయకుడు, బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైరయ్యాక కూడా ప్రజాజీవితంలోనే గడుపుతున్న ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత నిశితంగా తన పోరాటాన్ని మార్చనున్నారు. ప్రొఫెసర్ కోదండరాం రిటైరైన తర్వాత.. ప్రధానంగా రైతు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో పర్యటిస్తూ.. వాస్తవ పరిస్థితుల గురించి ప్రభుత్వానికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తూ.. ప్రభుత్వం రైతుల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరుతూన్నారు. అయితే తాజాగా పరిణామాల్లో కోదండరాంను కాంగ్రెస్ పార్టీ ఏజంటుగా, కాంగ్రెస్ తరఫున పోరాడుతున్న శిఖండిగా అభివర్ణిస్తూ తెరాస ఎంపీ బాల్క సుమన్ చాలా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో.. ఈ విమర్శలకు తాను జవాబు ఇవ్వబోయేది లేదని.. పలికిన చిలకలు ఎవరైనా సరే.. వారితో ఇలాంటి మాటలు పలికించిన వారికే తాను నేరుగా సమాధానం చెబుతానని కోదండరాం ఆగ్రహంగా సెలవిస్తున్నారు.

అంటే ఆయన తన పోరాటాల ద్వారా డైరక్టుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతోనే అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారనే సంగతి అర్థమవుతోంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావిస్తే, సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం దాటవేత ధోరణిలో ఎదురుదాడులకు దిగుతున్నదని ఆయన ఆరోపిస్తున్నారు.

తెలంగాణ పౌరసమాజంలో కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా, రాష్ట్రం కోసం పరితపించిన వ్యక్తిగా ఎంత పేరున్నదో, ప్రొఫెసర్ కోదండరాంకు కూడా అంతే పేరుంది. కాకపోతే.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఆయనను కేసీఆర్ పక్కన పెట్టారు. కోదండరాం కూడా రాజకీయేతర పోరాటం మాత్రమే ఐకాస ద్వారా చేస్తున్నారు. అయితే కోదండరాంకు కాంగ్రెస్ రంగు పులమడానికి గులాబీ దళాలు తాజాగా ప్రయత్నిస్తున్నాయి.

ఐకాస సంధించే ప్రశ్నలకు బహిరంగ చర్చలో సమాధానం చెప్పి తీరాల్సిందేనని, ప్రభుత్వం తప్పించుకోజాలదని కోదండరాం హెచ్చరిస్తున్నారు. ఎవరో పలికిస్తే మాట్లాడడానికి ఐకాస చిలుక కాదని, చిలుకలకు కాకుండా, వారితో మాట్లాడించే వారికే తాము సమాధానం ఇస్తామని ప్రొఫెసర్ హెచ్చరించడం విశేషం.

తమ కార్యకలాపాలకు ఆటంకం కల్పించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అలాగే తన మీద , తన ఫోను మీద ప్రభుత్వం నిఘా పెట్టిందని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ కేసీఆర్ సర్కారు గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. సర్కారు మీద విపక్షాలు కాంగ్రెస్, తెదేపా చేసే ఆరోపణలకంటె, కోదండరాం చేసే ఆరోపణలకు ప్రజల్లో మన్నన ఎక్కువ. ఆయన లేవనెత్తుతున్న ప్రజా సమస్యలకు సంబంధించి ప్రభుత్వం సమాధానం ఇచ్చి, బాధ్యతను నిరూపించుకోకుంటే.. ఇలాంటి అంశాలే వారికి చేటు చేసే ప్రమాదమూ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Similar News