తెలంగాణ రాజకీయ శక్తులు బలాబలాలను కూడదీసుకుంటున్నాయి. భిన్నమైన సమీకరణలు, పొత్తులు, మైత్రీపూర్వక పోటీలకు అవసరమైన ప్రాతిపదికను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత స్పష్టంగా ద్విముఖ పోరాట చిత్రం తెలంగాణలో కనిపించడం లేదు. భావ వైరుద్ధ్యాలకు ప్రతీకలైన సామాజిక శక్తులు, చైతన్య గీతికలైన విప్లవాత్మక సంస్థలు ఎన్నికలకు తెర ముందు , తెర వెనక రాజకీయాలను శాసించేందుకు ప్రయత్నించడం తెలంగాణలో దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రాజకీయ పక్షానికి ప్రబలమైన ఓటింగు ఉండటంతో చాలా సంక్లిష్టమైన రాజకీయ చిత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఒకప్పుడు పూర్వపు అయిదు జిల్లాలకే పరిమితమైన పార్టీగా పేరుపడిన తెలంగాణ రాష్ట్రసమితి 2014 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజామద్దతు సాధించడంతోపాటు అధికారపార్టీగా అవతరించింది. అయినప్పటికీ ప్రజలు భిన్నమైన పక్షాలకు వారి వారి బలాలను అనుసరించి పట్టం కట్టారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తోపాటు తెలుగుదేశం, బీజేపీ, ఎంఐఎం, వై.సి.పి, సీపీఐ,సీపీఎం వంటి ఎనిమిది పార్టీలు శాసనసభలో ప్రవేశించాయి. తెలంగాణ సమాజం భిన్నభావనలు, వాదనలకు ప్రతీకగా నిలుస్తుందనేందుకు ఇంతకు మించిన ఉదాహరణ ఉండదు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి ఇలాంటి పొందిక చాలా ఉపయోగపడుతుంది. సామాజికంగా , సైద్దాంతికంగా వేర్వేరు వర్గాలకు, శ్రమజీవులకు ప్రాతినిధ్యం వహించేవారు తమ వాణిని అసెంబ్లీ వేదికగా వినిపించేందుకు అవకాశం ఉంటుంది. కానీ 2019 ఎన్నికల నాటికి ఈ రకమైన సమీకరణ కనిపించకుండా ఏకచ్ఛత్రాధిపత్యంగా తెలంగాణ రాష్ట్రసమితి అప్రతిహత విజయం సాధించాలనే వ్యూహంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ పావులు కదుపుతున్నారు. 2014 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ విపక్షాలు డీలాపడటం ,కనీసం డిపాజిట్ సాధించడమే గగనమైన పరిస్థితులు ఆయన భరోసాకు కారణంగా నిలుస్తున్నాయి.
కోదండ, కాంగ్రెసు కాంబో...?
తెలంగాణ సంయుక్త కార్యాచరణ సమితి(టీజాక్) పేరిట రాష్ట్రసాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆ సంస్థ ఛైర్మన్ ఇప్పుడు విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తనకు సరైన గుర్తింపు లభించలేదనే ఆవేదన,ఆక్రోశం కోదండరామ్ లో నెలకొంది. విద్యా,ఉద్యోగ,రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తెచ్చిన టీజాక్ ను తెలంగాణ రాష్ట్రసమితి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేసింది. బలమైన ఆ వాయిస్ ఏదో ఒక రోజున తనకు వ్యతిరేకంగా మారవచ్చని ముందే గ్రహించిన కేసీఆర్ మొదట్లోనే సంస్థను కోలుకోలేని దెబ్బతీశారు. చీలిక తెచ్చారు. మళ్లీ టీజాక్ ను పునురుజ్జీవింపచేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వాయిస్ వినిపించేందుకు కోదండరామ్ ప్రయత్నిస్తున్నారు. రాజకీయపార్టీని పెట్టే ఉద్దేశం ఉందని కూడా ప్రకటించారు. కొంతమేరకు టీజాక్ బలోపేతమైన తర్వాత కాంగ్రెసుతో చేతులు కలిపేందుకు అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉమ్మడి శత్రువైన టీఆరఎస్ ను దెబ్బతీసేందుకు ఇది తప్పనిసరి అవసరంగా ఇరుపక్షాలు గుర్తించాయంటున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్న దృష్ట్యా వేర్వేరుమార్గాల్లోనే ప్రస్థానిస్తూ అవసరమైన సందర్బంలో కలిసి పనిచేయాలనేది కోదండ, కాంగ్రెసు పార్టీల వ్యూహంగా చెబుతున్నారు. అదే జరిగితే ఇదో బలమైన రాజకీయ వేదికగానే ఎన్నికల నాటికి రూపుదాల్చవచ్చు.
కారు , సైకిల్ తో కలిస్తే...
రేవంత్ రెడ్డి వంటి కేసీఆర్ బద్ధ వ్యతిరేకులు పార్టీని విడిచిపెట్టి పోవడంతో టీఆర్ఎస్, టీడీపీ లు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కూడా అవకాశాలున్నాయనేది రాజకీయ అంచనా. ఇందుకు టీడీపీలోని తెలంగాణ పెద్దలు సుముఖంగానే ఉన్నారు. తాము వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుపు సాధించాలంటే టీఆర్ఎస్ అండ అవసరమనేది టీటీడీపీ అగ్రనాయకుల భావన. అయితే టీఆర్ఎస్ మాత్రం ఇప్పుడే తన మనసులోని మాటను బయటకు చెప్పడం లేదు. సాధ్యమైనంతవరకూ టీడీపీ క్యాడర్ ను, లీడర్లను తమ పార్టీలో విలీనం చేసుకున్న తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి బేరసారాలు జరపవచ్చనేది టీఆర్ఎస్ యోచనగా కనిపిస్తోంది. వెనకబడిన తరగతుల్లో కొంతమేరకు పట్టు ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పటికి కూడా కనీసం 40 నియోజకవర్గాల్లో మూడు నుంచి అయిదువేల వరకూ ఓటు బ్యాంకు ఉండొచ్చనేది టీఆర్ఎస్ వర్గాల అంచనా. అయితే ఈ ఓటు బ్యాంకు ఎన్నికల వరకూ నిలబడుతుందా? లేదా? ఒకవేళ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ఎన్ని సీట్లు కేటాయించాలి? కాంగ్రెసు బలమైన ప్రత్యర్థిగా మారితేనే టీడీపీతో చేతులు కలిపేందుకు టీఆర్ఎస్ సాహసించవచ్చు. కాంగ్రెసు, విపక్షాలు అన్నీ కలిస్తే టీడీపీ సాయాన్ని టీఆర్ ఎస్ అర్ధిస్తుంది. విపక్షాలు ఎవరి కుంపటి వారిదే అన్నట్లుగా బరిలోకి దిగితే టీఆర్ఎస్ టీడీపీని దూరంగా పెట్టే అవకాశాలున్నాయి. వంటరిగా గెలిచే అవకాశమున్న చోట చంకన టీడీపీ బరువు పెట్టుకోవడమెందుకు? అంటూ ఒక టీఆర్ఎస్ నాయకుడు అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానించడం ఇందుకు అద్దం పడుతోంది.
వామపక్ష, ఉద్యమ శక్తుల వంటరి పోరు...
ఉద్యమాల్లో ఎంతో చురుకుగా కనిపించినప్పటికీ ఓటింగుకు వచ్చే సరికి నానాటికీ తీసికట్టుగా మారుతున్న వామపక్షాల వ్యూహం మరో రకంగా ఉంది. సీపీఐ కాంగ్రెసుతో కలిసి వెళితే బాగుంటుందనే భావనలో ఉంది. సీపీఎం మాత్రం ఉద్యమ శక్తులు, ప్రజాసంఘాలను ఏకతాటిపైకి తెచ్చి ప్రత్యామ్నాయ రాజకీయపక్షంగా మార్చాలనే దిశలో కార్యాచరణ రూపొందిస్తోంది. భిన్నమైన కులసంఘాల సమూహంగా టీమాస్ కు ఇప్పటికే ఒక వేదిక ఏర్పాటు చేశారు. దళితులు, అత్యంత వెనుకబడిన వర్గాలు టార్గెట్ గా టీ మాస్ పనిచేస్తోంది. మరోవైపు చిన్నాచితక రాజకీయ పక్షాలను కూడా కలిపి ఐక్య సంఘటన పేరిట మరో కూటమిని రూపకల్పన చేసేపనిలోకి దిగింది సీపీఎం. ప్రజాసంఘాలతో కూడిన టీమాస్ ఒకవైపు, రాజకీయ కార్యాచరణతో కూడిన ఐక్య సంఘటన మరోవైపు ప్రభుత్వానికి ఊపిరి సలపకుండా చేయాలనే ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెసు, టీఆర్ ఎస్ లతో సంబంధం లేకుండా ఈ కూటమి ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తోంది. అయితే ఐక్య సంఘటన రాజకీయంగా బలపడితే టీఆర్ఎస్ కే లబ్ధి చేకూరే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో 38 శాతం ఓటింగు సాధించిన టీఆర్ఎస్ తర్వాత జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే మరింత బలపడింది. తాజాగా ఆ పార్టీ అంతర్గత సర్వేల ప్రకారం 48 నుంచి 50 శాతం వరకూ టీఆర్ఎస్ ఓట్లు సాధించగలదనే అంచనాకు వచ్చారు. ఈ సర్వే ఫలితాలే నిజమైతే మిగిలిన విపక్షాలన్నీ కలిసి పోటీ చేస్తే తప్ప టీఆర్ఎస్ ను నిలవరించడం సాధ్యంకాదు. ఐక్య సంఘటన వంటి కూటములు ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు చిల్లు పెడితే అది అంతిమంగా టీఆర్ఎస్ కే లాభిస్తుంది.
-ఎడిటోరియల్ డెస్క్