కేసీఆర్ అడుగు జాడల్లోనే చంద్రబాబు నిర్ణయాలు

Update: 2016-11-30 19:41 GMT

రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత.. ఇద్దరు ముఖ్యమంత్రులూ ఒకరితో ఒకరు పోటీపడి తాము మెరుగంటే తాము మెరుగని అనిపించుకోవడానికి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నట్లుగా మనకు పలు సందర్భాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకించి ఉద్యోగులకు వేతనాల పెంపు, ఆర్టీసీ వేతనాల పెంపు లాంటి అనేక విషయాల్లో ఒకరి నిర్ణయం కోసం రెండో వాళ్లు ఎదురుచూసి, అంతకంటె బెటర్ ప్యాకేజీ ఇవ్వడం ద్వారా మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నాలు చేశారు. అయితే తాజాగా నోట్ల రద్దు పర్యవసానంగా జనం కష్టాలను దూరం చేయడం, ఆన్ లైన్ లావాదేవీల వైపు ప్రజలను మళ్లించడం అనే విషయంలో ఇరురాష్ట్రాలూ వేగంగానే అడుగులు వేస్తున్నప్పటికీ.. ఫైనల్‌గా చూసేసరికి కేసీఆర్ అడుగుజాడల్లో చంద్రబాబునాయుడు నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ప్రజలను ఆన్‌లైన్ లావాదేవీల వైపు మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడిపేలా ప్రత్యేకమైన యాప్ లను రూపొందించే పనిలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ విషయంలో కేసీఆర్ ముందడుగు వేశారు. ఆయన ఒక రోజు ముందుగా ప్రెస్ మీట్ పెట్టి.. టీ- వ్యాలెట్ పేరుతో ఓ యాప్ ను రూపొందిస్తున్న సంగతిని ప్రకటించారు. సరిగ్గాఅదే బాటలో చంద్రబాబు కూడా అడుగులు వేశారు. కాకపోతే కేసీఆర్ వ్యాలెట్ అంటే.. చంద్రబాబు పర్స్ అన్నారు. ‘ఏపీ పర్స్’ అనే పేరుతో ఏపీ సర్కారు ఒక యాప్ రూపొందిస్తున్నట్లుగా చంద్రబాబునాయుడు ప్రకటించారు.

అదొక్కటే కాదు.. ప్రభుత్వ ఉద్యోగులకు కొంత వేతనం క్యాష్ రూపంలో ఏర్పాటు చేసే విషయంలో కూడా చంద్రబాబునాయుడు కేసీఆర్ అడుగు జాడల్లోనే నడిచినట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వోద్గోగులకు కొంత క్యాష్ ఇప్పించే ఆలోచన ఏపీ సర్కారుకు లేదు. అలాంటి ఏర్పాటు ఏమీ లేదని ఆర్థిక మంత్రి యనమల ముందుగా ప్రకటించేశారు కూడా. అయితే మరు రోజున తెలంగాణ సర్కారు దీనికి అనుకూల నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు పదివేల రూపాయలు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తరువాత తమ ప్రభుత్వ ఉద్యోగుల్లో నిందలు పడాల్సి వస్తుందని అనుకున్నారేమో చంద్రబాబు కూడా సేమ్ టూ సేమ్ నిర్ణయం తీసుకున్నారు. పది వేల రూపాయలను 1,2 తేదీల్లో మాత్రం బ్యాంకు కౌంటర్ల ద్వారా ఉద్యోగులకు ఇవ్వడానికి నిర్ణయించారు.

కాకపోతే బ్యాంకు కౌంటర్ల ద్వారా మాత్రమే తీసుకునే ఏర్పాటు కావడంతో ఇరు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వోద్యోగులు వెల్లువల బ్యాంకులపై పడే అవకాశం ఉంది. అందుకోసం వారు మరి కార్యాలయాలకు సెలవు పెట్టి వెళ్లి జీతం తెచ్చుకోవాలా? అనేది వారిలో ఇప్పుడు రేగుతున్న సందేహం గా ఉంది.

Similar News