మూలిగే నక్కపై తాటిపండు అన్న చందంగా తయారవుతున్నది కేంద్రం వ్యవహరిస్తున్న తీరు. నోటు కష్టాలనుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. నెలమారి ఒకటోతేదీ రావడంతో.. జనానికి నోటు కష్టాలు పెరిగాయి. ఈ ఇక్కట్లలోనే ఊపిరి సలపకుండా ఉన్న సమయంలోనే ఇళ్లలో ఉండే బంగారం మీద కూడా పన్నులు వేస్తారనే ప్రచారం సగటు మధ్య తరగతికి షాక్ ఇచ్చింది. అయితే బంగారానికి సంబంధించి ప్రభుత్వం ఆలోచన ఏమిటో , అసలు ఉన్న నిబంధనలు ఏమిటో.. ప్రజలకు ఏమీ స్పష్టత లేకపోవడంతో.. కేంద్రం చేసిన ప్రకటనలు స్పష్టంగా లేకపోవడంతో.. మరింత గందరగోళం పెరుగుతోంది.
ప్రత్యేకించి ఇద్దరు కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలు ప్రజల్లోని గందరగోళాన్ని పెంచడానికి కారణం కావడం కూడా గమనించాల్సిన విషయం. బంగారంపై పన్నులకు సంబంధించి గురువారం జైట్లీ ఒక ప్రకటన చేశారు. ఎవరి వద్ద ఎంత బంగారం ఉండడానికి అనుమతి ఉంది.. అనేది వెల్లడిస్తూ.. ఐటీ చట్ట సవరణలో కొత్తగా బంగారానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు జోడించలేదని, ఈ నిబంధనలు అన్నీ గతంలోనుంచి ఉన్నవే అని ఆయన వెల్లడించారు. అయితే పాతకాలం నుంచి బంగారం విషయంలో ఉన్న నిబంధనలు ఏమిటో ప్రజలకు తెలియని పరిస్థితి సమాజంలో ఉంది.
జైట్లీ వ్యాఖ్యలు ఇలా ఉండగా.. వెంకయ్యనాయుడు మాటలు దీనికి విరుద్ధంగా ఉండడం గమనార్హం.
వెంకయ్యనాయుడు మాత్రం రద్దయిన నోట్లతో బంగారం కొని నిల్వ చేసుకోదలచుకున్న నల్లకుబేరులపై ఉక్కు పాదం మోపేలా కేంద్రం చట్టంలో పలు మార్పులు చేసినట్లుగా ప్రకటించారు. లెక్కల్లో చూపని బంగారం మీద 75 శాతం వరకు పన్ను ఉంటుందంటూ వెంకయ్యనాయుడు వెల్లడించారు.
ఒకవైపేమో జైట్లీ బంగారం విషయంలో ఎలాంటి కొత్త నిబంధనలు తేలేదని అంటున్నారు, మరోవైపు నల్లకుబేరుల బంగారం భరతం పట్టేలా చాలా నిబంధనలు సవరించాం అని వెంకయ్య అంటున్నారు.. ఎవరి మాటలు నిజమో.. ఏ రకంగా తమను సర్కారు ఇబ్బందులకు గురి చేయబోతున్నదో అర్థం కాక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.