కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుతకుతలాడిపోతున్నారు. తన శాసనసభ్యత్వాన్ని అధికార పార్టీ అక్రమంగా రద్దు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాలను ఇటీవల స్పీకర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పై హెడ్ ఫోన్ విసిరేయడంతో ఆయన కంటికి గాయమైంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేశారు.
నేతల మధ్య విభేదాలే....
దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం వీడియో ఫుటేజీని సమర్పించకపోవడంతో కేసును వచ్చే మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది. అయితే తమకు ఇంత అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తుందన్నది కోమటరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి ముగ్గురూ నల్లగొండ జిల్లాకు చెందిన వారే. కోమటిరెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య విభేదాలు ఈనాటివికావు. పీసీసీ చీఫ్ పదవిలో ఉత్తమ్ ఉన్నంత వరకూ తాను గాంధీభవన్ గడప తొక్కనని ఒకానొకదశలో కోమటిరెడ్డి శపథం కూడా చేశారు.
దీక్ష తర్వాత గాయబ్....
ఈనేపథ్యంలో శాసనసభ్యత్వాలు రద్దయిన తర్వాత గాంధీభవన్ లో 48 గంటల దీక్ష చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లు. ఈ దీక్షకు కాంగ్రెస్ నేతలందరూ సంయుక్తంగా మద్దతు పలికారు. అధికారపార్టీపై పోరాడతామని ప్రతిన చేశారు. అయితే ఆ దీక్ష తర్వాత వీరిద్దరినీ వదలిశారన్నది కోమటిరెడ్డి వర్గీయుల ఆరోపణ. ఇద్దరు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను అధికార పార్టీ రద్దు చేస్తే కనీసం తెలంగాణ బంద్ కు పిలుపు ఇవ్వకపోవడమేమిటన్నది వారి నుంచి వస్తున్న సూటి ప్రశ్న. కోమటిరెడ్డిపై ఉన్న వ్యక్తిగత కోపాన్ని ఈవిధంగా కొందరు కాంగ్రెస్ నేతలు తీర్చుకుంటున్నారని వారుబహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
అధిష్టానికి ఫిర్యాదు చేసే యోచనలో....
కనీసం ఆందోళన కార్యక్రమాలకు పిలుపు నివ్వకపోవడం, అధిష్టానం వద్ద ఈ విషయాన్ని సీరియస్ గా నేతలు చర్చించకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పీసీసీ నేతలపై ఫిర్యాదు చేసేందుకు కోమటిరెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 30వ తేదీన నేరుగా రాహుల్ గాంధీని కలిసి రాష్ట్ర పార్టీలో నెలొకొన్న పరిస్థితులను వివరించాలని వారి ఆలోచన. అందుకే హస్తినకు బయలుదేరి వెళుతున్నారు. అందివచ్చిన అవకాశాన్ని కూడా కాంగ్రెస్ నేతలు సద్వినియోగం చేసుకోలేకపోయారని వారు ఫిర్యాదు చేయనున్నారు. కేసుల విషయంలో కూడా తమకు పెద్దగా సహకరించడం లేదని కోమటిరెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.