కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై బాబు నిజాయితీ ఎంత‌..?

Update: 2017-12-02 13:30 GMT

ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అత్యంత సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. 2014 ఎన్నిక‌లకు ముందు కాపు సామాజిక వ‌ర్గానికి ప్ర‌క‌టించిన విధంగా కాపుల‌ను బీసీల్లో చేరుస్తూ.. వారికి 5% రిజ‌ర్వేష‌న్ ప్ర‌క‌టించింది. దీనిపై అసెంబ్లీలో చ‌ర్చించి.. ఆమోదించి కేంద్రానికి పంప‌డం ద్వారా ఆమోదించుకోవాల‌ని బాబు ప్ర‌భుత్వం ప్లాన్. ఈ క్ర‌మంలోనే శ‌నివారం నాటి స‌భ‌లో దీనిని ప్ర‌వేశ పెట్టారు కూడా. దీనిపై సాధార‌ణంగా అధికార పార్టీ స్వోత్క‌ర్ష‌కు దిగ‌డం మామూలే! బాబుకు ఇప్ప‌టికే డ‌ప్పు వాయిస్తున్న నేత‌లు మ‌రింత‌గా పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఇక‌, ఈ నిర్ణ‌యాన్ని బిల్లు రూపంలో ప్ర‌వేశ పెట్టి.. దానిని ఆమోదించి కేంద్రానికి పంపుతామ‌ని చంద్ర‌బాబు నిన్న మీడియా ముఖంగా వెల్ల‌డించారు.

మంజునాధ ఏం చెప్పారు...?

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. అస‌లు విష‌య‌మే ఇప్పుడు చ‌ర్చ‌కు రావాల్సి ఉంది. వాస్త‌వానికి బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి అధ్య‌య‌నం చేసిన క‌ర్ణాట‌క హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ మంజునాథ ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించిన నివేదిక‌లో కాపు రిజ‌ర్వేష‌న్ల‌ను ఇంత ఇవ్వాలి అనికానీ, ఇంత ఉంటే బాగుంటుంద‌ని కానీ ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. అంతేకాదు, కాపుల‌కు కార్పొరేష‌న్ నిధుల‌ను మాత్ర‌మే పెంచాల‌ని ఆయ‌న సూచించాడు. ఇక‌, కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం ఉన్న స్థాయిలో వారి జీవ‌న ప‌రిస్థితి లేద‌ని, వారు దాదాపు బీపీఎల్‌కు పైనే ఉంటున్నార‌ని స్ప‌ష్టం చేశారు.

గుజ్జర్లకు ఏం జరిగింది?

అయితే, ఇదే క‌మిటీలోని మిగిలిన స‌భ్యులు మాత్రం కాపుల‌కు కూడా బీసీల‌కు న‌ష్టం క‌లిగించ‌ని రీతిలో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డం మంచిదేన‌ని వ్యాఖ్యానించారు. దీనినే అనువుగా తీసుకున్న చంద్ర‌బాబు.. కాపుల‌కు 5% రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే, బీసీల‌కు దీంతో సంబంధం లేద‌ని 50% రిజ‌ర్వేష‌న్ల‌కు పైనే ఉంటాయ‌ని అన్నారు. వీటిని రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ఇస్తున్న విష‌యం ఈ సంద‌ర్భంగానే వెల్ల‌డైపోయింది. ఇదే స‌మ‌యంలో ఈ ఏడాది దేశంలో జ‌రిగిన రెండు ప‌రిణామాల‌ను ప‌రిశీలించాల్సి ఉంటుంది. ఒక‌టి రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం అక్క‌డి గుజ్జ‌ర్ల ఆందోళ‌న‌కు త‌లొగ్గి.. వారికి 3% రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించింది. అయితే, దీనిని రాజ‌స్థాన్ హైకోర్టే తోసిపుచ్చ‌డం గ‌మ‌నార్హం.

న్యాయపరమైన చిక్కులు తప్పవా?

ఇక‌, గుజ‌రాత్‌లో ప‌టేల్ సామాజిక వర్గాలు త‌మ‌కు కూడా రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని ఉద్య‌మాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఈ విష‌య‌మే హాట్ టాపిక్‌గా మారింది. ఇందులోనూ వీరికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఉన్న రిజ‌ర్వేష‌న్ల‌ను 50% మించి ఇవ్వ‌డం స‌మంజసంకాద‌ని సుప్రీం కోర్టు ప‌లు తీర్పుల్లో స్ప‌ష్టం చేసింది. త‌మిళ‌నాడు త‌ర‌హాలో ఓ వ‌ర్గానికి క‌ల్పించిన రిజ‌ర్వేష‌న్‌ను రాజ్యాంగంలోని న్యాయ ప‌రిధిలోకి రాని 9వ షెడ్యూల్ లో చేర్చాల‌ని, అప్పుడు ఎలాంటి గోలా ఉండ‌ద‌నేది రిజ‌ర్వేష‌న్ల‌ను ఆశిస్తున్న‌వారి మాట‌. ఇది కాకుండా ఏం చేసినా.. న్యాయ ప‌రిధిలో చిక్కులు త‌ప్ప‌వ‌నేది ఖాయం. ఇక‌, ఏపీలో కాపుల‌కు క‌ల్పించ‌నున్న రిజ‌ర్వేష‌న్లు కూడా న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల‌ను ఎదుర్కోవ‌డం ఖాయ‌మ‌నే మాటే వినిపిస్తోంది.

Similar News