కలిసి పోరాడే మాట పవన్ నోట్లో రాదా?

Update: 2016-11-10 12:44 GMT

‘రాజకీయాల్లో నాకు ఎవ్వరూ శతృవులు లేరు’ అని పవన్ కల్యాణ్ సెలవిస్తారు. తద్వారా తానొక ఆదర్శ రాజకీయాలను సృజించడానికే ఈ రంగంలోకి వచ్చాననే భావన కలిగించడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తారు. చంద్రబాబునాయుడు గానీ, జగన్మోహనరెడ్డి గానీ తనకు ఇద్దరూ ఒకటే అని కూడా పవన్ కల్యాణ్ సెలవిస్తారు. తాను వ్యక్తుల మీద కక్ష కట్టనని, వ్యక్తిగత విమర్శలు చేయను అని.. పార్టీల మరియు ప్రభుత్వాల విధానాల మీదనే తన పోరాటం ఉంటుందని పవన్ కల్యాణ్ చెబుతారు. మరి ఇంత చెబుతున్న పవన్.. తాను డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదా అంశాన్నే తనకంటే ముందునుంచి తనకంటె బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన రెడ్డితో కలిసి పోరాటం చేయడానికి.. తద్వారా తమ పోరాటానికి బలం పెంచడానికి ఎందుకు ప్రయత్నించరు? ఇది సామాన్యులకు ఎదురయ్యే మిలియన్ డాలర్ ప్రశ్న.

పవన్ కల్యాణ్ హోదా గురించే పోరాడుతున్నారు. హోదా కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీ వెళ్లి అక్కడి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మన రాష్ట్ర ప్రజల వాంఛను తెలియజేస్తానని పవన్ కల్యాణ్ అంటున్నారు. తన ఢిల్లీ యాత్రకు అనంతపురంలోని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను కూడా వెంటబెట్టుకు వెళ్తానని అంటున్నారు. అలా ‘కలుపుకుపోయే’ తత్వాన్ని కొన్ని సంస్థల విషయంలో ప్రకటిస్తున్న పవన్ కల్యాణ్ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్న వివిధ రాజకీయ పార్టీలను కూడా కలుపుకుపోవడానికి తద్వారా తమ డిమాండుకు బలం చేకూర్చడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు. ఇతర రాజకీయ శక్తులు ఇదే డిమాండును వినిపించినప్పుడు ఆయన వారిని అంటరాని పార్టీలుగా ఎందుకు చూస్తున్నారు. ఆయా రాజకీయ పార్టీల ఇతరత్రా సిద్ధాంతాలు, విధానాలతో పవన్ కల్యాణ్ కు విభేదం ఉండొచ్చు గాక.. కానీ కనీసం ఈ ఒక్క అంశం మీద అందరూ కోరుకుంటున్నది ఒక్కటే అయినప్పుడు ఆ పార్టీలను తన ఉద్యమంలో కలుపుకుని పోరాడడానికి పవన్ కల్యాణ్ స్నేహహస్తం చాచలేకపోవడం రకరకాల అనుమానాలు కలిగిస్తోంది.

రాష్ట్రంలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ అందరూ కూడా తమ తమ స్థాయుల్లో హోదా కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. పవన్ కల్యాణ్ తన తాజా ప్రసంగంలో జగన్ కూడా తనకు శత్రువు కాదంటున్నారు. మరి అందరి లక్ష్యం ఒక్కటే అయినప్పుడు ఆయనే పూనిక వహించి అందరినీ ఒక్కతాటి మీదకు ఎందుకు తేవడం లేదు అనేది పవన్ ఆలోచించుకోవాలి. నిజంగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి హోదా సాధించాలంటే గనుక.. ఇలా ఆ హోదా అడుగుతున్న పార్టీలన్నీ కలిసి ఐక్యంగా పోరాడితేనే మన డిమాండులోని బలం కేంద్రానికి తెలుస్తుంది అని పవన్ గ్రహించాలి.

Similar News