కడివెడు పాలలో రెండు విషం చుక్కలు...

Update: 2016-10-05 00:46 GMT

మనలో మనకు లక్ష తగాదాలు అంతర్గతంగా ఉండవచ్చు గాక.. కానీ బాహ్యశత్రువుతో పోరాడేటప్పుడు.. అవన్నీ మరచిపోవాలి.. అందరం కలిసి ఒక్కటే అనే భావన అవతలి వ్యక్తికి కలిగించాలి. ఇది నీతి. కానీ.. మన దేశ చరిత్రలో ఎప్పుడు ఆనవాళ్లు వెతుక్కున్నా.. ఈ నీతికి కలిగిన గాయాలే కనిపిస్తాయి! పురాణా కథల్లో కావచ్చు.. రాజులు, తురుష్కుల దాడులు, మొగలాయిల ఆక్రమణల కాలం నాటి చరిత్ర పుటల్లోంచి కావచ్చు... మన కళ్ల ముందు జరిగిన జాతీయోద్యమ సమయంలో కావొచ్చు.... బాహ్యశత్రువుకు వ్యతిరేకంగా ఓ ఉధృతమైన పోరాటం జరుగుతున్నప్పుడు స్వార్థ సంకుచిత ప్రయోజనాలను లక్ష్యించి, స్వపక్షీయులే సహకరించని లేదా వెన్నుపోటు పొడిచిన వైనం చర్విత చరణమే.

బ్రూటస్‌లు, దౌలత్‌ ఖాన్‌ లోడీలు, మీర్‌ జాఫర్‌ లు మళ్లీ ఇప్పుడు మన దేశంలో పుట్టుకొస్తున్నారు. కాకపోతే వారిప్పుడు అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ పార్టీ, సంజయ్‌ నిరుపమ్‌, ఓంపురి లాంటి కొత్త పేర్లు పెట్టుకుని నవీన సమాజంలో మనుగడ సాగిస్తున్నారు. జాతీయ స్ఫూర్తిని మంటగలుపుతున్నారు.

పైన చెప్పుకున్న వేదనాపూర్వకమైన పరిస్థితి ఇప్పుడు మళ్లీ కనిపిస్తోంది. పాకిస్తాన్‌ ఉగ్రవాద దాడులతో మన దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంటే.. భారత్‌ సర్జికల్‌ దాడులకు పాల్పడింది. ఇదేమీ రాజకీయ దాడి కాదు.. మోదీ 'నేను వెళ్లి దాడిచేశాను' అని టముకు వేసుకోలేదు. భజన పరులందరూ కీర్తిని మోదీకి ఆపాదించడానికి ఎన్ని ప్రయత్నాలు అయినా చేయవచ్చు గాక.. కానీ మన భారతీయ సైన్యం ప్రదర్శించిన సాహసానికి ఇది మెచ్చుతునక. సర్జికల్‌ దాడుల గురించి మోదీ, రాజ్‌నాధ్‌, పారికర్‌ లేదా వెంకయ్య ల ప్రకటనల్ని తుంగలో తొక్కండి. కనీసం సైనిక చీఫ్‌ చేసిన ప్రకటనను కూడా నమ్మకపోవడం అనేది స్వదేశంలో ఉన్న విపక్షాలు చేయాల్సిన పని కాదు.

సర్జికల్‌ దాడులు అనేవి మన ఘనతను చాటేవి గనుక.. అవి జరగనే లేదని ప్రపంచానికి చెప్పుకోడానికి పాకిస్తాన్‌ నానా పాట్లు పడుతోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు.. సర్జికల్‌ దాడులు జరిగినట్లుగా ఆధారాలుచూపాలని, ఇవి అబద్ధం అనే అనుమానం కలుగుతున్నదని స్వదేశంలో ఒక వెన్నుపోటు ప్రచారాన్ని ప్రారంభించాయి.

అరవింద్‌ కేజ్రీవాల్‌ చాలా నిజాయితీ గల గొప్ప అధికారి అయితే కావొచ్చు గాక.. కానీ అది ఆయన వ్యక్తిగత ప్రతిభ మాత్రమే. జట్టు నాయకుడిగా ఆయన ఎంత అసమర్థుడో ఇప్పటికి పలుమార్లు నిరూపణ అయింది. అలాంటి కేజ్రీవాల్‌.. కేంద్రంలో మోదీ ఏ పనిచేసినా సరే... దాన్ని దుమ్మెత్తిపోయడం తన నిత్యకృత్యంగా వ్యవహరిస్తుంటారు. అయితే జాతికి పట్టిన ఖర్మ ఏంటంటే.. సర్జికల్‌ దాడులను కూడా ఈ రాజకీయ పక్షాలు మోదీ ఘనతలాగా చూసి, ఓర్వలేకపోతున్నాయి తప్ప.. ఇది జాతి ఘనత అని గుర్తించలేకపోతున్నాయి. మోదీని ఇబ్బంది పెట్టడానికి కేజ్రీవాల్‌ ప్రశ్నలు సంధిస్తే.. పాకిస్తాన్‌లో కేజ్రీవాల్‌ను నెత్తిన పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ కూడా అదే తప్పు చేస్తోంది. బయటి శత్రువుతో వ్యవహరించేప్పుడు మనం ఐక్యంగా ఉండాలనే నీతిని కాలరాస్తోంది. నూటయాభయ్యేళ్ల చరిత్ర ఉన్న పార్టీగా చెప్పుకునే వారు ఇంత సంకుచితంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు స్వదేశంలోనే పార్టీల అనుమానాల దరిమిలా.. అంతర్జాతీయంగానూ కొందరు సందేహాల్ని వ్యక్తం చేసే ధైర్యం తెచ్చుకున్నారు.

భారత జాతీయ సైన్యం యొక్క సాహసాన్ని కించపరిచే ఇలాంటి మాటలు ఈ నేతలు మానుకోవాలి. నిజానికి ఇలాంటి వారు మరో ఇద్దరు నాయకులు ఉంటే చాలు.. అంతర్జాతీయంగా మన భారత జాతి ప్రతిష్ట మంటగలిసిపోతుంది. ఇలాంటి మీర్‌ జాఫర్‌లు, దౌలత్‌ఖాన్‌ లోడీలు మరికొందరు తయారయ్యారంటే.. మన జాతిలో ఉన్న స్థైర్యం, భారత సేనల స్ఫూర్తి కూడా మంటగలుస్తుంది.

నాయకులారా మీ బుద్ధులు కాస్త మార్చుకోండి.

Similar News