ఒవైసీ ఒత్తిడికి కేసీఆర్‌ తలొగ్గుతారా?

Update: 2016-10-05 12:43 GMT

కేసీఆర్‌ చాలా విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారని పేరుంది. అంటే తాను తలచినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారే తప్ప.. ఎవ్వరి ఒత్తిడులనూ ఖాతరు చేయడని అంటుంటారు. అయితే ఇప్పుడు కొత్త జిల్లాలకు పేర్లు పెట్టే విషయంలో ఆ వైఖరిని ఆయన మరోమారు నిరూపించుకోవాల్సి వచ్చేలా ఉంది. వికారాబాద్‌ జిల్లా పేరు విషయంలో ప్రజాభిప్రాయం ఒకరకంగా, కేసీఆర్‌ మీద ఒత్తిడి తేగల శక్తుల అభిప్రాయం మరొక రకంగా ఉంది. అందుకే.. వికారాబాద్‌ జిల్లా పేరు విషయంలో కేసీఆర్‌ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా ఉంది.

కొత్త జిల్లాల ఏర్పాటు దాదాపుగా పూర్తి కావస్తున్న వైనం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో వికారాబాద్‌ జిల్లాను కూడా ఏర్పాటుచేశారు. అయితే తెలంగాణ ప్రాశస్త్యాన్ని మరింత ఎక్కువగా ప్రతిబింబించేలాగా.. వికారాబాద్‌ జిల్లాకు అనంతగిరి అని పేరు పెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లుగా, ఆ మేరకు సూచన చేసినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. నిజానికి వికారాబాద్‌ ప్రాంతానికి అనంతగిరి అనేది చాలా సబబైన పేరు. ఇక్కడి అనంతగిరి అడవులు, ఆలయం.. యావత్‌ తెలంగాణకే వన్నె తెచ్చే స్థాయిలోనివి. పద్ధతిగా అభివృద్ధి చేసినట్లయితే.. దేశవ్యాప్తంగా, విదేశీ టూరిస్టులను కూడా ఆకర్షించగలిగేంత కీలకమైనవి మన అనంతగిరి అడవులు. వాటి పేరు జిల్లా కు పెడితే ఖచ్చితంగా ఎంతో బాగుంటుంది.

అదే సమయంలో స్థానిక ప్రజలు కూడా హైపవర్‌ కమిటీని కలిసి తమ జిల్లా పేరును అనంతగిరిగా నామకరణం చేయాలని కోరుతున్నారు.

అయితే ఇక్కడో ట్విస్టు ఉంది. ఈ కొత్త జిల్లా ఏర్పాటుకు వికారాబాద్‌ అనే పేరునే ఉంచాలని మజ్లిస్‌ పార్టీ నాయకుడు ఒవైసీ కోరుతున్నారు. వికారాబాద్‌ అనేది నిజాం పాలకులను ప్రతిబింబించేది కావడంతో ఆయన దాన్ని కోరుకుంటున్నారు. నిజానికి ప్రభుత్వం ప్రస్తుతం వికారాబాద్‌ పట్టణం పేరు మార్చడం లేదు. ఆ ప్రాంతంతో కూడి కొత్తగా ఏర్పడుతున్న జిల్లాకు కొత్త పేరు పెడుతోంది. అయితే ఒవైసీ మాత్రం వికారాబాద్‌ అనే పేరే ఉండాలని కోరుతూ కేసీఆర్‌కు ఒక లేఖ రాశారు.

ఇప్పుడు బంతి కేసీఆర్‌ కోర్టులో ఉంది. ఆయన తన ఆలోచనను, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తారా? లేదా, కాంబినేషన్లు లెక్కవేసుకుని ఒవైసీ వినతిని పరిగణిస్తారా అనేది వేచిచూడాలి.

Similar News