ఆ పని చేస్తే లోకేశ్‌ను శెభాష్‌ అనాల్సిందే!

Update: 2016-10-07 00:23 GMT

ప్రజాప్రతినిధులకు అమరావతిలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మూడో రోజు పాల్గొన్న నారా లోకేష్‌ ఓ ఆసక్తికరమైన సంగతి వెల్లడించారు. అక్కడ కాసేపు మీడియాతో ముచ్చటించిన లోకేష్‌.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఆ విషయాన్నే తాము ఎలా ఆచరిస్తున్నామో చెప్పే ప్రయత్నం చేస్తూ.. తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటినుంచి , పార్టీ మీద అభిమానంతో, పార్టీనే నమ్ముకుని జెండా మోస్తున్న నిరుపేద కార్యకర్తలను గుర్తించి, వారి కుటుంబాల పేరుతో రెండేసి లక్షల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు వేస్తాం అని, వాటి మీద వచ్చే వడ్డీ సొమ్మును ప్రతినెలా ఆయా కుటుంబాలకు అందే ఏర్పాటు చేస్తాం అని లోకేష్‌ అన్నారు.

ఒక రకంగా చూసినప్పుడు ఇది చాలా మంచి ఆలోచన అనిపిస్తుంది. జెండాలు మోసే కార్యకర్తలు జీవితాంతమూ జెండాలు మోస్తూ ఉంటారే తప్ప.. ఎన్నికల సమయంలో ఏదో నాయకులు కాసిని డబ్బులు విదిలిస్తే అక్కడితో ఆనందిస్తారు తప్ప.. తమ రాజకీయ పార్టీ అభిమానం వల్ల ఆర్థికంగా స్థిరపడిన సందర్భాలు ఉదాహరణలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడూ 'పల్లకీ మోసే జాతి- పల్లకీ ఎక్కే జాతి' రెండూ వేర్వేరుగా ఉంటాయి. 'పల్లకీ మోసే జాతి'లో సామాన్య కార్యకర్తలు ఉంటారు. ఎన్నికల సమయంలో తప్ప వారి గురించి ఎవరూ పట్టించుకోరు. 'ఎక్కే జాతి'లోని వాళ్లు మాత్రమే తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దళారీ పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు.

అయితే లోకేష్‌ తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోవడానికి ముందునుంచి కూడా కార్యకర్తల సంక్షేమానికి కొన్ని కొత్త ఆలోచనలు పార్టీలోకి తెచ్చారు. కార్యకర్తల పిల్లలకు చదువులు చెప్పించడం, స్కూళ్లు నడపడం లాంటివి ఇందులో కీలకమైనవి. కార్యకర్తలకు ఇన్సూరెన్సు చేయించి, ప్రీమియంను పార్టీ చెల్లించడం లాంటివి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారికి ఏకంగా ఓ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడం చిన్న సంగతి కాదు.

అయితే ఒక్కొక్క నియోజకవర్గానికి ఇలా ఎంతమంది పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తారు? అనేది చాలా కీలకం. ఆ సంఖ్య పార్టీకి పరమ విధేయులను , ఎన్నికల సమయంలో కష్టపడే వాళ్లను తయారు చేసి పెడుతుందనడంలో సందేహం లేదు. అటు పార్టీకి , ఇటు కార్యకర్తలకు కూడా లాభం కలిగించే అంశం అది. పార్టీ సంగతి ఎలా ఉన్నా.. రాజకీయంగా పార్టీల మీద అభిమానం పెట్టుకుని, తమ సొంత జీవితాల గురించి పట్టించుకోని అభాగ్యులు మనకు ఎంతో మంది కనిపిస్తుంటారు. లోకేష్‌ ఆలోచనను ఆచరణలో పెట్టేప్పుడు, అలాంటి చిత్తశుద్ధి గల కార్యకర్తలను నిజాయితీగా ఎంపికచేసి లబ్ధి చేకూరిస్తే వారికి మంచి జరుగుతుంది. పర్యవసానంగా పార్టీకి కూడా మంచి జరుగుతుంది.

Similar News