నరేంద్రమోదీ పెద్దనోట్ల రద్దుతో ఒక్కసారిగా దేశంలో ప్రకంపనాలు సృష్టించారు. ప్రజలు ఇదంతా నల్లధనం నియంత్రించడం కోసం జరుగుతున్న ప్రయత్నం అనే ఉద్దేశంతో తమకు అనూహ్యంగా ఎదురవుతున్న రకరకాల ఇబ్బందులను కూడా భరిస్తున్నారు. నల్లధనం మూలుగుతున్న వారు మాత్రం.. కుక్కిన పేనుల్లా మెదలకుండా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో నరేంద్రమోదీకి నల్లధనం కట్టడికి ఇలాంటి మార్గం సూచించిన వ్యక్తి గురించి కూడా చర్చ జరుగుతోంది.
ఔరంగాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ మరియు చార్టర్డ్ అకౌంటెంట్ అనిల్ బొకిల్ సలహా మేరకే ప్రధాని ఇలాంటి నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది జులైలోనే ప్రధాని అపాయింట్ మెంట్ తీసుకున్న అనిల్.. నల్లధనం గురించి తన వద్ద ఉన్న ఆలోచనలన్నీ మోదీతో పంచుకున్నారట. తొలుత మోదీ ఆయనకు 8 నిమిషాలు అపాయింట్ మెంట్ ఇచ్చినా.. రెండు గంటల పాటు ఏకధాటిగా భేటీ అయ్యారట. రియల్ ధరలు పెరగడానికి, డబ్బు విలువ కోల్పోడానికి ఇలాంటి అనేక దుర్మార్గాలకు పెద్దనోట్లే కారణమంటూ అనిల్ బొకిల్ మోదీకి కొన్ని మార్గాలు ప్రతిపాదించారుట.
- 500, 1000 నోట్లను వెంటనే రద్దు చేయడం. లావాదేవీలు ఎక్కువగా ఆన్ లైన్, బ్యాంకు ద్వారా జరిగేలా చూడడం. నగదు లావాదేవీలకు పరిమితి విధించి.. దానిపై పన్నులేకుండా చూడడం.
- బ్యాంకు లావాదేవీలపై (కేవలం క్రెడిట్ మీదే) 2 శాతం పన్ను విధించి దానిద్వారానే ప్రభుత్వం ఆదాయం పొందే మార్గాలు చూసుకోవడం.
- దిగుమతి సుంకం మినహా 56 రకాల పన్నులను రద్దు చేయాలి.
...
అనిల్ బొకిల్ ప్రధానంగా ఈ సూచనలు మోదీకి వినిపించారట. ఆయన అన్నీ సావధానంగానే విన్నట్టున్నారు. నల్లధనం కట్టడికి పెద్దనోట్ల నిషేధం అనేపాయింటును మాత్రమే ప్రధాని బుర్రలోకి ఎక్కించుకున్నట్లుగా ఉంది. ఎందుకంటే.. అనిల్ బొకిల్ చెప్పిన వాటిలో.. పెద్ద నోట్ల నిషేధం వల్ల కొన్ని ఇబ్బందులు సామాన్యులకు ఉన్నప్పటికీ.. 56 రకాల పన్నులను రద్దు చేయడం అంటూ ఆయన చేసిన సూచిన చాలా విలువైనది. మన దేశంలో పన్నుల వ్యవస్థ మొత్తం నానా కంగాళీగా గందరగోళంగా ఉండడం వల్లనే వాటిని ఎగవేయాలనే ధోరణి ప్రజల్లో పెరుగుతూ ఉన్నది. నిజాయితీగా ఉండదలచుకున్న వారిని పన్నుల రూపేణా వేధిస్తున్న ప్రభుత్వమే.. దొంగ వ్యవహారాలు నడిపే వారిని స్వయంగా ప్రోత్సహిస్తున వాతావరణం కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే .. సగటు పౌరులకు కడుపు మండి పన్నులు ఎగ్గొట్టడానికి గల మార్గాలను వారు వెతుక్కుంటున్నారు.
అయితే దేశ ప్రజలందరూ, ప్రధానంగా పన్ను చెల్లించే తరగతిలోని సంపాదన పరులందరూ కూడా మోదీ సర్కారును విపరీతంగా హర్షించి, ఆకాశానికి ఎత్తేసే ఈ మంచి సూచన గురించి మోదీ పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. 56 రకాల పన్నుల ఎత్తివేసి.. ఏకీకృతంగా బ్యాంకు క్రెడిట్ ల మీద వసూలు చేసే ఏర్పాటు ప్రభుత్వానికి కూడా చాలా మేలు చేస్తుంది. కానీ కట్టేవాళ్ల దగ్గరినుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులను వదులు కోవడానికి మోదీ సర్కారుకు మనసు ఒప్పినట్టు లేదు. అందుకే పన్నుల ప్రస్తావనను పక్కన పెట్టి.. నోట్ల నిషేధం వరకే అనిల్ బొకిల్ ఇచ్చిన సలహాను కార్యరూపంలో పెట్టారు. దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు తప్ప ఒరిగేది ఎంత ఉంటుందో క్లారిటీ రావడం లేదు. ప్రజల ఆదరణను మోదీ పొందాలంటే గనుక.. ప్రభుత్వం సగటు సంపాదన పరుల మీద విధిస్తున్న పన్నుల్లో ఎత్తివేయదగిన వాటి మీద కూడా కసరత్తు చేసి ప్రజలకు హితకరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తే.. వారిలో నిజాయితీని పెంచడం సాధ్యమవుతుంది. లేకపోతే.. మళ్లీ పన్ను ఎగవేతదారుల్ని తయారుచేసినట్లే అవుతుంది. ఆ సంగతిని మోదీ సర్కారు గుర్తించాలి.