అవినీతి ముందు నీతి ఓటమి పాలయింది. మచ్చలేని వ్యక్తి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడం బీహార్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. తన రాజీకయ జీవితంలో నితీష్ కుమార్ కు చిన్న మచ్చ కూడా అంటలేదు. నిజాయితీ, నిబద్ధత వ్యక్తిగా ఆయన పనిచేసుకుపోతున్నారు. స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి బీహార్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు నితీష్. రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరైన మద్యపానంపై నిషేధం విధించిన నితీష్ బీహార్ లో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కొన్ని దశాబ్దాలుగా బీహార్ లో అవినీతి రాజ్యమేలుతోంది. అభివృద్ధి శూన్యమనే చెప్పాలి. నితీష్ వచ్చిన తర్వాతే రాష్ట్రం కొంత గాడిలో పడింది. బీహార్ ను ఇతర రాష్ట్రాలకు ధీటుగా తీసుకెళ్లే పనిలో ఉన్నారు నితీష్. ఈ నేపథ్యంలో బీహార్ ప్రజలు నితీష్ కు మరోసారి పట్టం కట్టారు. అయితే గత ఎన్నికల్లో బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవడం నితీష్ దురదృష్టంగా చెప్పుకోవచ్చు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన లాలూ కుటుంబ సభ్యులు తన మంత్రి వర్గంలో ఉండటాన్ని నితీష్ సహించలేకపోయారు. గత కొన్నాళ్ల నుంచి ఆయన లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ రాజీనామా చేయాలని కోరుతూనే వస్తున్నారు. కేసుల నుంచి బయటపడిన తర్వాత తిరిగి మంత్రివర్గంలోకి చేరవచ్చని లాలూ పార్టీకి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
అన్ని ప్రయత్నాలూ చేసి.....
కాని లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం తనమొండిపట్టును వీడలేదు. కుమారుడిపై ప్రేమతో ఆయన నితీష్ విన్నపాన్ని మన్నించకుండా సవాల్ విసిరారు. తన కుమారుడు తేజస్వి యాదవ్ రాజీనామా చేయబోరని చెప్పేశారు. దీంతో నితీష్ తీవ్రంగా మనస్థాపం చెందారు. నితీష్ ఇటీవల ఢిల్లీ వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీని కలిసి బీహార్ లో పరిస్థితిని వివరించారు. తేజస్విని వెనకేసుకురాకండని రాహుల్ కు కూడా నితీష్ సీరియస్ గానే చెప్పారు. అయితే రాహుల్ కూడా నితీష్ మాటలను లైట్ గానే తీసుకున్నట్లుంది. దీంతో తానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నితీష్ తన నిబద్ధతను చాటు కున్నారు. నితీష్ రాజీనామాతో బీహార్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అయితే బీహార్ రాజకీయాలను బీజేపీ నిశితంగా గమనిస్తుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ రాజీనామా చేసిన వెంటనే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీజేపీ నితీష్ కు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. కాని నితీష్ అందుకు ఒప్పుకుంటారా? లేదా? అన్నది కొద్ది గంటల్లోనే తేలనుంది.